శనివారం తుదిశ్వాస విడిచిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ పాశ్చాత్య సంగీతమంటే ఇష్టమని తెలుస్తోంది. పాదరక్షల సేకరణా తనకు ఇష్టమైన అలవాటని తన ఆత్మకథ 'సిటిజెన్ దిల్లీ: మై టైమ్స్-మై లైఫ్' పుస్తకంలో షీలా రాశారు. తనకు ఉన్న మరో అలవాటు పుస్తకాలు చదవడం.
'అప్పుడు టీవీలు లేవు. రేడియో ప్రసారాలు నిర్ణీత వేళల్లో మాత్రమే ఉండేవి. అప్పుడు పాఠ్యాంశాలు చదవడం, పుస్తకాలతో కాలక్షేపం, అప్పుడుప్పుడు సినిమాలకు వెళ్లడం, సంగీతం వినడమే'నని తన ఆత్మకథలో రాశారు షీలా.
శుక్రవారం రాత్రుల్లో పాశ్చాత్య సంగీతం వినడానికి కేటాయించేవారమని స్పష్టం చేశారు. తమకు ఇష్టమైన పాటలను వేసేందుకు రేడియో స్టేషన్లకు ఫోన్లు చేసేవారమని రాసుకొచ్చారు.
షీలా దీక్షిత్ తండ్రి జింఖానా క్లబ్ సభ్యుడు. ఈ కారణంగా ఇంటికి దగ్గర్లోనే ఉన్న క్లబ్‌కు వెళ్లి వారానికి చదవగలిగినన్ని పుస్తకాలు తెచ్చుకునే వాళ్లమని తన ఆత్మకథలో షీలా ఉటంకించారు.
తనకు ఇష్టమైన పుస్తకాలు రిచ్మల్ క్రాంఫ్టన్ రాసిన 'జస్ట్ విలియమ్', అలెగ్జాండర్ డ్యూమా 'ద త్రీ మస్కిటీర్స్', విక్టర్ హ్యూగో 'లే మిసెరబుల్స్' అని పేర్కొన్నారు.
పాదరక్షలంటే మహాప్రీతి
పాదరక్షలపై తనకు ఉన్న ఇష్టాన్ని ఆత్మకథలో బయటపెట్టారు షీలా. పాకిస్థాన్ శరణార్థులకు చెందిన చెప్పుల దుకాణాల వల్ల అప్పటి పెద్ద బ్రాండ్ల నుంచి తప్పించుకునేందుకు అవకాశం వచ్చిందని ఆత్మకథలో షీలా పేర్కొన్నారు. మంచి రంగులతో కూడిన పాదరక్షల జతను అప్పట్లో ఆ దుకాణాలు రూ. 3కు అమ్మేవని తన ఆత్మకథలో వెల్లడించారు. తన నెల పాకెట్‌మనీని దాచి...ఆ డబ్బుతో పాదరక్షలను కొనేవారమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రేమ కోసం షీలా.. రెండేళ్ల నిరీక్షణ