ఎన్నికల సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తన ప్రసంగంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని.. మోదీ ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానాలు, కార్యక్రమాలపైనే విమర్శలు చేశానని బదులిచ్చారు. మోదీపై తాను చేసిన ఆరోపణలు నిరాధారమైనవేమీ కాదన్నారు రాహుల్. భాజపా ప్రభుత్వం అనుసరిస్తోన్న దళిత వ్యతిరేక విధానాలపైనే వ్యాఖ్యానించినట్లు రాహుల్ స్పష్టం చేశారు. తనపై ఉన్న ఫిర్యాదులను కొట్టేయాలని అధికారులను కోరారు. తన స్పందనతో పాటు ఈ విషయానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను ఈసీకి అందజేశారు రాహుల్.
ఈసీ వివక్ష లేకుండా పనిచేయాలి
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదుల విషయంలో దేశ రాజకీయ నాయకులందరిపైనా ఎలాంటి వివక్ష చూపకుండా ఎన్నికల సంఘం విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా సూచించారు రాహుల్.
రాహుల్ వ్యాఖ్యలు
ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్ షాదోల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. 'మోదీ ప్రభుత్వం గిరిజనులను చంపడానికి కొత్త చట్టాన్ని రూపొందించింది' అని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తాయని భాజపా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఈనెల 1న రాహుల్‌కు ఈసీ షోకాజ్‌నోటీసులు జారీచేసింది. ఈ విషయంపై స్పందనకు గడువు పెంచాలని ఇప్పటికే రెండుసార్లు కోరిన రాహుల్ ఎట్టకేలకు శుక్రవారం స్పందించారు.
ఇదీ చూడండి : 'అబ్బే... గంభీర్ అలాంటి వ్యక్తి కాదే...'