సమకాలీన రాజకీయాల్ని ఏ కోణం నుంచి పరికించినా కళ్లకు కట్టేది కుంభకోణమే. రాగద్వేషాలు, భయపక్షపాతాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తామంటూ రాజకీయ నేతలు చేసే పదవీ ప్రమాణాల్లో పస ఎంతో, వాళ్ల అదుపాజ్ఞల్లో పనిచేసే అవినీతి నిరోధక విభాగాలు సాక్షాత్తు కోర్టుకు సమర్పించే ప్రమాణ పత్రాలూ (అఫిడవిట్లు) ఆ బాపతే. అభిప్రాయాలు అప్పుడప్పుడు మార్చుకోనివాడు రాజకీయ నాయకుడు కానేరడన్నాడు గిరీశం. రాజకీయ బాసులతో అంటకాగుతున్నప్పుడు ఆ లక్షణం తనకు ఒంటబట్టేసిందన్నట్లుగా సమయానుకూలంగా అభిప్రాయాల్ని మార్చేసింది మహారాష్ట్రలోని అవినీతి నిరోధక విభాగం. ఆ వైనం చిత్తగించండి!
‘మహారాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాల నిబంధనావళిలో పదో నిబంధన అనుసారం- అప్పటి కాంగ్రెస్, ఎన్‌సీపీ ప్రభుత్వంలో అత్యధిక కాలం జలవనరుల శాఖకు మంత్రిగా పనిచేసిన వ్యక్తే ఆ విభాగంలో జరిగిన మంచి చెడులన్నింటికీ బాధ్యులవుతారు’- బాంబే హైకోర్టు నాగపూర్ బెంచికి నిరుడు నవంబరు ఆఖరు వారంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ సమర్పించిన ప్రమాణపత్రం అది. నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో ఎకాయెకి రూ.70 వేలకోట్ల కుంభకోణం జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అందులో అజిత్ పవార్ ప్రమేయం ఏమేరకో నిగ్గుతేల్చాలంటూ హైకోర్టు ఆదేశించాక, ఏసీబీ ఆ ప్రమాణపత్రం దాఖలు చేసింది. నిబంధనల మేరకు దస్త్రాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన బాధ్యత కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లదేనని అజిత్ పవార్ చెబుతున్నా, కాంట్రాక్టుల అప్పగింత, ముందస్తు చెల్లింపులకు సంబంధించిన అన్ని ఫైళ్లపై ఆయన సంతకాలే ఉన్నాయని కోర్టుకు ఏసీబీ విన్నవించింది. ప్రభుత్వ బొక్కసానికి భారీగా గండికొట్టినవారంతా నిబంధనల మాటున దాక్కుని, ఎవరికి వారు తప్పును ఇతరుల నెత్తిన రుద్దడానికే చూస్తున్నారనీ స్పష్టంగా ప్రకటించింది. ‘ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు జలవనరుల మంత్రిత్వశాఖలోనే జరిగిన కుట్ర ఇది’ అనీ ప్రమాణపత్రంలో ఏసీబీ స్పష్టీకరించింది. సరిగ్గా ఏడాది తిరిగేసరికల్లా ఏసీబీ అభిప్రాయం ఎలా మారిపోయిందో గమనించండి!
‘జలవనరుల శాఖ మంత్రే విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ కార్యనిర్వాహకవర్గం చేసిన తప్పొప్పులకు ఆయనను బాధ్యుణ్ని చేయలేము... అక్రమాలు జరిగాయో లేదో చూసే బాధ్యత ఆయనది కాదు’- అంటూ ఏసీబీకి ప్రాతినిధ్యం వహించిన ఎస్‌పీ హైకోర్టుకు 16 పేజీల అఫిడవిట్ సమర్పించారు. కాంట్రాక్టుల అప్పగింతలో మంత్రిగా అజిత్ పవార్ జోక్యం చేసుకొన్నారన్న ఏసీబీ ఆ మాటను పరగడుపున పారేసి- అక్రమాలన్నింటికీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లే బాధ్యులంటోంది. అధిక ధరలు కోట్ చేసిన టెండర్లను ఆమోదించవద్దంటూ జలవనరుల కార్యదర్శి అజిత్ పవార్‌కు సలహా ఇచ్చినట్లు ఎక్కడా దస్త్రాల్లో లేనేలేదనీ తన వాదనను సమర్థించుకొంది. విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలోని 45 ప్రాజెక్టులకు సంబంధించి 2,654 టెండర్లపై ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. వాటిలో 32 నీటిపారుదల ప్రాజెక్టుల్లో రూ.17,700 కోట్ల మేర ‘అధిక వ్యయం’ జరిగిందన్న ఆరోపణల లోగుట్టుమట్లను ఏసీబీ పరిశీలిస్తోంది. 2018 నవంబరు, ఈ ఏడాది నవంబరుల మధ్య దర్యాప్తులో కొత్తగా తేలిన అంశాలేమిటి? వాటిలో వేటి ప్రాతిపదికన ఏసీబీ అభిప్రాయం మారిందన్న ధర్మసూక్ష్మాల కోసం ఎవరూ పనిగట్టుకొని జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. గాలివాలుకు తెరచాపలెత్తే కళాకౌశలం మెండుగాగల అవినీతి నిరోధక విభాగాలకు ఇలాంటి అఫిడ‘విట్లు’ కొత్తా కాదు!
ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు. అయిదేళ్లకోమారు అధికారం చేతులు మారే అవకాశం ఉన్న భారత ప్రజాస్వామ్యంలో ఎప్పటి పాలకుల మనోభావాలకు అనుగుణంగా అప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకొని పని చేసుకొంటూపోవడంలో అన్ని విభాగాలూ ఆరితేరిపోయాయిప్పుడు! చేసింది వివాదాస్పద పని అయినా దాన్ని నాజూగ్గా సమర్థించుకోవడంలోనూ ఏసీబీ వంటివి రాటుతేలిపోయాయి. అజిత్ పవార్‌ను అవినీతి కేసుల ఉచ్చునుంచి తప్పిస్తున్నారని, మైనారిటీలోని ఫడణవీస్ ప్రభుత్వానికి మద్దతిచ్చి నిలబెడుతున్నందుకు అది బహుమానమని పది రోజుల క్రితంల వార్తాకథనాలు ఎలుగెత్తాయి. అప్పుడు ఏసీబీ ఏమంది? అజిత్ పవార్‌కు ఏ మాత్రం సంబంధం లేని తొమ్మిది నీటిపారుదల విభాగాల కేసుల్నే మూసేశామని ఏసీబీ హడావుడిగా వివరణ దయచేసింది. గత నెల 27న హైకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రాన్ని పరికిస్తే- మహారాష్ట్ర పాలన వ్యవహారాల నిబంధనావళిలోని ఫలానా నిబంధన ప్రకారం ప్రాజెక్టుల్లో విక్రమించిన అక్రమాల్లో వేటికీ సంబంధిత మంత్రిగా అజిత్ పవార్‌కు బాధ్యత ఉండదని నివేదించింది. ఇప్పుడు మూసేసిన కేసులు తొమ్మిదా పందొమ్మిదా అన్నది కాదు ప్రధానం. అడ్డగోలు నిబంధనను అడ్డంపెట్టి అజిత్ పవార్‌కు అన్ని కేసుల నుంచీ రక్షణ కల్పించేలా సాక్షాత్తు అవినీతి నిరోధక శాఖ పరిశ్రమించడమే వైపరీత్యం. అది జరిగిందెప్పుడు? ఫడణవీస్ సర్కారులో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా కుదురుకున్న రెండు రోజుల తరవాత; శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరడానికి ముందురోజు! ‘ఒకసారి దాఖలు చేసిన ప్రమాణపత్రానికి పూర్తిభిన్నంగా ఏసీబీ మరోదాన్ని కోర్టుకు ఎలా సమర్పిస్తుంది?’ అని తాజా మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ విస్తుపోతున్నారు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అని ఏసీబీ పెద్దలు సకిలిస్తే ఎవరు కాదనగలరు?
నీటిపారుదల శాఖ మంత్రిగా అజిత్ పవార్ చక్రం తిప్పినప్పుడు పట్టుమని మూడు నెలల్లో 32 ప్రాజెక్టులకు అనుమతి లభించింది. సంబంధిత విభాగం కాదూ కూడదన్నా అంచనా వ్యయాలు విపరీతంగా పెరగడానికి అజిత్ పవార్ చొరవే పుణ్యం కట్టుకుంది. 2012 సెప్టెంబరులో ప్రసార మాధ్యమాలు వెలికి తెచ్చిన వాస్తవాలివి. 1200 దాకా భారీ మధ్యతరహా చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది రూ.70 వేలకోట్లు. నీటివసతి పొందిన ప్రాంతంలో పెరుగుదల పాయింట్ ఒక్క శాతం. విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థ పాలక మండలి అనుమతి లేకుండానే 2009లో ఎనిమిది నెలల వ్యవధిలో రూ.20 వేలకోట్ల ప్రాజెక్టులకు అనుమతి దయచేసిన పెద్దమనసు అజిత్ పవార్‌ది. ఈ తరహా అక్రమాలపై రేగిన రాజకీయ సంక్షోభమే 2012లో అజిత్ పవార్ పదవీచ్యుతికి దారితీసింది. దాని వెన్నంటి కాంగ్రెస్, ఎన్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాటి విపక్ష నేతగా ఫడణవీస్ 14 వేల పత్రాల్ని సాక్ష్యాధారాలుగా సమర్పించారు. కార్యనిర్వాహక వర్గంతో కుమ్మక్కైన కంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమిషన్లు రాబట్టుకొనే కుట్రకు పాల్పడ్డారనీ ఆరోపించారు. మాధవ్ చితాలె నేతృత్వంలోని దర్యాప్తు బృందం వాస్తవాల్ని నివేదించినా- నాటి ప్రభుత్వం అజిత్ పవార్‌కు ‘క్లీన్‌చిట్’ దయచేసింది. 2014లో ఫడణవీస్ ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే ఏసీబీకి కేసును బదలాయించినా- నాలుగేళ్లపాటు నత్తలతో పోటీపడి సాగించిన దర్యాప్తు ద్వారా కుట్రకోణాల్లో అజిత్ పవార్ బాధ్యత ఉందని తీర్మానించింది. అదే ఇప్పుడు ఇలా మాట ఫిరాయించిందంటే ఏమనుకోవాలి?
నీటిపారుదల శాఖలో గుమాస్తా నుంచి ఆయా విభాగాల ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు, డైరెక్టర్లు, కార్యదర్శి, ఛైర్మన్ దాకా విస్పష్ట ముడుపుల వాటాలు, వారివారి కోటాల మేరకు చెల్లించాల్సిందేనని, మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఈ లంచాలమేత 22 శాతం దాకా ఉందని పుణెకు చెందిన ఓ కంట్రాక్టరే ప్రభుత్వానికి 2014లో లిఖితపూర్వకంగా గోడు వెళ్లబోసుకొన్నాడు. ఎవరెంతగా మొత్తుకొన్నా బధిరాంధక పాత్రను సమర్థంగా పోషించే ఏసీబీ వంటి విభాగాలకు పట్టదు. కేంద్రస్థాయిలో కేదస, ఈడీలు, రాష్ట్రాల పరిధిలో ఏసీబీలు పాలక శ్రేణుల పరిచారికలుగా మారబట్టే రాజకీయ అవినీతికి పట్టపగ్గాలుండటం లేదు. ఏమంటారు?
- పర్వతం మూర్తి
ఇదీ చూడండి: కాలంచెల్లిన మందుగుండే దిక్కా: కాగ్ నివేదిక