పశ్చిమబంగలోని విష్ణుపూర్లాంతర్లు, దశావతారాల కార్డులకు ఒకప్పుడు విపరీతమైన గిరాకీ ఉండేది. కానీ.. నాడు ఆ కళను నమ్ముకుని బతికినవాళ్లంతా ప్రస్తుతం ప్రత్యమ్నాయ ఉపాధిమార్గాలు వెదుక్కుంటున్నారు. కళాకారులే కాదు, ఈ కళ కూడా ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కళకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు విష్ణుపూర్ సబ్ డివిజన్ ఇటీవలే కొన్ని చర్యలు చేపట్టింది. లాంతర్లు, దశావతారాల తయారీ ప్రక్రియలను కలిపి, దశావతార్ కార్డు లాంతర్లు రూపొందిస్తున్నారు.
"రెండు కళలనూ కలిపే ప్రయత్నం చేశాం. దశావతారాల కార్డులను లాంతర్లతో కలపమని, కళాకారులను అడిగాం. ప్రస్తుతం కిరోసిన్‌తో వెలిగే దీపాలకు బదులు సువాసనభరిత కొవ్వొత్తులు వాడుతున్నాం".
-మానస్ మోండల్, ఎస్డీఓ, బిర్భూమ్.
దశావతార్ కార్డులు రాజా బిరంబీ కాలంలో బెంగాల్లో వెలుగులోకి వచ్చాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ వద్దకు వెళ్లినప్పుడు ఈ కార్డులు చూశారాయన. దిల్లీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు విష్ణుభగవానుడి కార్డులు తయారు చేయమని కళాకారులను ఆదేశించాడు. ఆనాడు దశావతార్ కార్డులు తయారుచేసిన కుటుంబసభ్యులే ఇంకా వీటిని తయారుచేస్తున్నారు.
"లాంతరు 4 వైపులా ఉండే గాజుపై మేమిప్పుడు దశావతార్ కార్డులు గీస్తున్నాం. దీపాలతో కలగలిపిన కార్డులకు ఈమధ్య గిరాకీ బాగానే ఉంది. దశావతార్ కార్డులను విడిగా అమ్మినప్పటి కంటే ఇప్పుడు కొంచెం మెరుగైంది".
-ప్రశాంత ఫౌజ్దార్, కళాకారుడు.
ఒకప్పుడు విష్ణుపూర్ లాంతరు అంటే దేశవ్యాప్తంగా సుపరిచితమే. కానీ విద్యుత్ బల్బులు వచ్చిన తర్వాత, వాటి డిమాండ్ పూర్తిగా పడిపోయింది. అందుకే లాంతర్లు ఇప్పుడు దశావతార్ కార్డులతో సుందరంగా ముస్తాబవుతున్నాయి.
"విద్యుత్ బల్బుల వినియోగం విపరీతంగా పెరిగింది. ఈకాలంలో విద్యుత్ కోతలూ బాగా తగ్గాయి. ఫలితంగా సంక్షోభం ఎదుర్కుంటున్నాం. మా పని కోసం ఓ కొత్త మార్గం ఎంచుకున్నాం. ఇకనైనా డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం".
-తపన్ గరాయ్, కళాకారుడు.
"పశ్చిమబంగ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. విశ్వబంగ్లా లాంటి ప్రభుత్వ ప్రదర్శన విభాగాలు కళాకారుల నుంచి లాంతర్లు కొనుగోలు చేస్తున్నాయి. వీటితో వారికి లాభాలు వస్తున్నాయి".
-మానస్ మోండల్, ఎస్డీఓ, బిర్భూమ్.
దశావతార్ కార్డులు ముద్రించిన దీపాలే కాక విద్యుత్ బల్బులతోనూ ఆధునికంగా లాంతర్లు తయారు చేస్తున్నారు ఈ కళాకారులు. దశావతార్ కార్డ్ లాంతర్లు తక్కువధరకే అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేస్తే, కళను బతికించడమే కాదు, కళాకారులకు బతుకుదెరువు కల్పించినట్లవుతుంది.
ఇదీ చదవండి:ప్రశాంతమైన నిద్రకు నాలుగు గ్యాడ్జెట్‌లు!