దిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ మార్గాలను వారంపాటు మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే నిత్యావసర వాహనదారులు, అనుమతి పాస్‌లు ఉన్నవారు.. యథావిథిగా ప్రయాణం కొనసాగించవచ్చని సీఎం తెలిపారు.
ప్రజా స్పందనను బట్టి నిర్ణయం..
వారం రోజులు తర్వాత.. సరిహద్దులను తెరిచే అంశంపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కోరారు కేజ్రీవాల్. ఇతర రాష్ట్రాల ప్రజలను దిల్లీలోకి అనుమతించడం వల్ల.. వైద్య సేవలు అధిక భాగం వారే పొందుతారని సీఎం అన్నారు. ఫలితంగా స్థానికులు ఇబ్బందులను ఎదుర్కొంటారని కొందరు తనతో చెప్పినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
కరోనా సోకిన వారికి చికిత్సనందించే విధంగా సరిపడా పడకలు దిల్లీలో అందుబాటులో ఉన్నాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని సడలింపులను దిల్లీ ప్రభుత్వం అమలుచేస్తోందని చెప్పారు సీఎం. సెలూన్లు, దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నామన్న కేజ్రీవాల్.. వాటి నిర్వహణపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తమ స్పందనలు తెలుపవచ్చని స్పష్టం చేశారు.
దిల్లీ-నొయిడా సరిహద్దులను మూసివేస్తున్నట్లు గౌతమ్ బుద్ధనగర్ జిల్లా అధికారులు ప్రకటించారు. 20 రోజులుగా అక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో 42 శాతం దిల్లీతో సంబంధం ఉన్నవేనని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'వ్యాక్సిన్ వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు'