దిల్లీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారటంపై పోలీసులను మందలించింది సుప్రీంకోర్టు. అల్లర్లపై విచారం వ్యక్తం చేస్తూ.. హింస చెలరేగడం దురదృష్టకరమని పేర్కొంది. అదే సమయంలో ఆందోళనలపై దాఖలైన పిటిషన్ల విచారణకు నిరాకరించింది న్యాయస్థానం.
జస్టిస్ ఎస్కే కౌల్, కేఎం జోసేఫ్లతో కూడిన ధర్మాసనం పిటిషన్లను పరిశీలించింది. అల్లర్లను ప్రేరేపించేవారిని అదుపు చేసి ఉంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేవి కావని అభిప్రాయపడింది ధర్మాసనం. అయితే.. ఎవరైనా హింసకు ప్రేరేపించే ప్రకటనలు చేస్తే కోర్టు ఆదేశాల కోసం చూడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. చట్టానికి లోబడే ఆ చర్యలు ఉండాలని స్పష్టం చేసింది న్యాయస్థానం.
ఈ సందర్భంగా దిల్లీ అల్లర్లకు సంబంధించిన పిటిషన్లను హైకోర్టు విచారణ చేపట్టినట్లు ధర్మాసనానికి తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. హింసాత్మక ఘటనలపై ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దని కోర్టుకు విన్నవించారు. దాని వల్ల పోలీసులు నిరుత్సాహానికి గురవుతారని అన్నారు సొలిసిటర్ జనరల్.
యూఎస్, యూకే పోలీసును ఉదహరిస్తూ..
దిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. దీర్ఘకాలిక చర్యలను దృష్టిలో ఉంచుకుని స్పందించినట్లు స్పష్టం చేసింది ధర్మాసనం. అమెరికా, బ్రిటన్‌లోని పోలీసులను ఉదహరిస్తూ.. ఏదైనా తప్పు జరిగినప్పుడు వారు చట్టానికి లోబడి వ్యవహరిస్తారని పేర్కొంది.
వాదనల అనంతరం పిటిషన్లను పక్కనపెట్టింది న్యాయస్థానం. ఈ విషయంలో హైకోర్టు విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది. మరోవైపు షాహీన్‌బాగ్ నిరసనలపై విచారణను మార్చి 23కు వాయిదా వేసింది.