ఈశాన్య దిల్లీలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. శుక్రవారం ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోలేదు. భద్రతకు భరోసా కల్పిస్తూ పోలీసులు, పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించడంతో ప్రజలు బయటకు వస్తున్నారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరుచుకోగా నిత్యావసరాలు తీసుకెళ్తున్నారు.
వీధుల్లో పేరుకుపోయిన రాళ్లు, దుండగులు దహనం చేసిన వాహనాలు, తోపుడు బండ్లను తొలగించే పనిని ముమ్మరం చేసింది దిల్లీ మున్సిపల్ విభాగం.
దర్యాప్తు వేగవంతం...
హింసాత్మక ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించడం సహా సీసీ కెమెరాల సాయంతో.. దుండగులను గుర్తించే పని మొదలుపెట్టారు. ఇప్పటివరకు 630 మందిని అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు.. 148 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వివరించారు.
సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గత ఆదివారం ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మూడో వంతు మందికి తూటా గాయాలున్నట్లు సమాచారం.
తాహిర్ ఇంటి నుంచే...
అల్లర్లలో నిఘా అధికారి అంకిత్ శర్మ మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తండ్రి.. ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ దీనికి కారణం అని ఆరోపించారు. హుస్సేన్ ఇంటిపైనుంచే దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారని, కాల్పులు జరిపారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
నిరీక్షణ...
ఘర్షణల్లో చనిపోయిన వారి మృతదేహాల కోసం వారి కుటుంబసభ్యుల నిరీక్షణ కొనసాగుతోంది. సమన్వయలోపంతో అధికారులు, పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గురు తేజ్ బహదూర్, లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రుల్లో భద్రపర్చిన మృతదేహాలను.. ఫ్రీజర్‌లలో భద్రపర్చకపోవడం వల్ల కుళ్లిపోయే దశకు చేరుకున్నాయని ఆరోపిస్తున్నారు.
జేఎన్‌యూలో ఆశ్రయానికి నో..
అల్లర్ల బాధితులకు తమ ప్రాంగణంలో ఆశ్రయం కల్పించరాదని విద్యార్ధి సంఘాలను హెచ్చరించింది దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేసింది.