ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. గంటకు 16 కి.మీ వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
మే 1 వరకు వాయవ్య దిశగా పయనించనున్న ఫొని తుపాను.. క్రమంగా ఈశాన్యం వైపు మళ్లి ఒడిశా తీరానికి చేరే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను సమయంలో గంటకు 80-90 కి.మీ వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది.
పెను తుపానుగా మారితే గంటకు 170-180 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. గురువారం నుంచి ఒడిశా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ.
'ఫొని’ తుపాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాతో పాటు కోస్తాంధ్రకు చెందిన ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పటికే అప్రమత్తం చేసింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లినవారు తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుపాను పట్ల అప్రమత్తమయ్యాయి. జాతీయ విపత్తు నిర్వహణ దళం, కోస్ట్‌గార్డులను ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించాయి. తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్రాల విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
- ఇదీ చూడండి: 'సైకిల్కి వేశాం.. కమలం వచ్చింది'