సరిహద్దులో తుపాకులు పట్టి గస్తీ కాసే సైనికులు... ప్రజల కోసం అహోరాత్రులు శ్రమిస్తారు. మరి జనాలు కష్టం వచ్చింది రక్షించండి అంటే చూస్తూ ఉంటారా? అందుకే మేమున్నాం అంటూ రంగంలోకి దిగారు. గన్లు పట్టిన చేతులతోనే చెట్లు నరికేందుకు రంపాలు పట్టారు. తుపాను గాయాలను తుడిపేందుకు ముందుండి సేవలందిస్తున్నారు.
రాత్రీపగలు తేడాలేకుండా..
జాతీయ విపత్తు స్పందన దళాలు(ఎన్డీఆర్ఎఫ్), సైనిక బృందాలు బంగాల్లో అంపన్ తుపాను సహాయక చర్యలు ప్రారంభించాయి. తుపాను వల్ల దెబ్బతిన్న మౌలిక సౌకర్యాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న అటవీ శాఖ, పౌర సంస్థలకు అండగా నిలిచాయి.
ఉప్పునీటి సరస్సు, బెహాలా, గోల్ పార్క్ ప్రాంతాల్లో రోడ్లమీద పడిన భారీ వృక్షాలను తొలగించడానికి.. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఆదివారం ఉదయమే రంగంలోకి దిగాయి. దక్షిణ కోల్కతాలోని పలు ప్రాంతాల్లో యంత్రాలతో చెట్లను నరికి... విద్యుత్, రవాణా, సౌకర్యాలను పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించాయి. వారంతా రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సైతం వారితో పాటు సేవలందిస్తున్నారు.
మొబైల్, ఇంటర్నెట్ సేవలు..
విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు బుధవారం మధ్యాహ్నం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు అధికారులు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలు పునరుద్ధరించినట్లు తెలిపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నాయని చెప్పారు.
![Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7329072_3.jpg)
![Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7329072_1.jpg)
![Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7329072_4.jpg)
భారీ నష్టం
తుపాను వల్ల రూ.1 లక్ష కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆరు కోట్ల ప్రజల మీద తుపాను ప్రభావం చూపిందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వీడిన మిస్టరీ: మహారాష్ట్రలో మర్డర్- తెలంగాణలో అరెస్ట్