కేంద్ర ప్రభుత్వంపై అమెరికాలోని ప్రవాస భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారుల దీర్ఘకాలిక వీసాలను తాత్కాలిక నిలుపుదల చేయడాన్ని తప్పుబడుతున్నారు.
పిల్లలతో సమస్య..
ముఖ్యంగా ఓసీఐ కార్డు ఉన్న చాలా మంది మైనర్లకు ఇబ్బందిగా మారింది. వారి తల్లిదండ్రులకు మాత్రం ఇంకా భారత పౌరసత్వం ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు భారత్కు రావాలనుకున్నా పిల్లలకు అనుమతి లేకపోవటం వల్ల అక్కడే ఉండాల్సి వస్తోంది.
"అమెరికా నుంచి వచ్చే తల్లిదండ్రులతో వారి పిల్లలు (ఓసీఐ కార్డుదారులు)ను ప్రయాణించేందుకు అనుమతించాలి. అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రుల వీసాల గడువు తీరి పోతుంది. అయితే పిల్లలకు అమెరికా పౌరసత్వంతోపాటు ఓసీఐ కార్డులు ఉన్నందున భారత్ ఏర్పాటు చేసిన విమాన సదుపాయాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. కనీసం మైనర్ల వరకైనా అనుమతించేలా చూడాలి."
- ఫజల్ సత్తార్
భారత ప్రభుత్వం ఇలాంటి వివక్ష చూపిస్తుందని అనుకోలేదని అనిత అనే మరో మహిళ వాపోయింది. ఓసీఐ కార్డు ఉన్న తన కూతురు ఇంటికి వచ్చేందుకు ఎదురుచూస్తోందని తెలిపింది.
"ప్రపంచంలోని చాలా మంది ప్రవాస భారతీయులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు మూసివేయాల్సి వచ్చింది. ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఓసీఐ కార్డులున్న మా పిల్లలకు సాయం చేయండి. అమెరికా, బ్రిటన్లో చిక్కుకున్నవారిని తీసుకురండి."
- మాధవి శ్రీహరి
భారత పౌరులు కాదు..
అయితే, ఇండో అమెరికన్ కార్యకర్త సునంద వశిష్ట్ మాత్రం భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.
"ఓసీఐ కార్డుదారులు భారత పౌరులు కాదు. వాళ్లు భారత సంతతికి చెందినవారు మాత్రమే. ఓసీఐ అనేది దీర్ఘకాలిక వీసా. తమ పౌరులకు సంబంధించి భారత్ ప్రాధాన్యం ఇస్తోంది. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఉంటే పరిష్కరించేందుకు రాయబార కార్యాలయాలు ఉన్నాయి. ఓసీఐ కార్డుదారులను సామూహిక తరలింపుల్లో చేర్చలేరు. ఉండకూడదు కూడా."
- సునంద విశిష్ట్
ఓసీఐ కార్డు అంటే..
భారత సంతతికి చెందిన వ్యక్తులకు ప్రభుత్వం ఓసీఐ కార్డులు జారీ చేస్తుంది. చాలా సందర్భాల్లో వీరికి వీసా లేకుండానే భారత్కు వచ్చేందుకు అనుమతిస్తుంది. వ్యవసాయ భూముల కొనుగోళ్లు, ఓటు హక్కు, ప్రభుత్వంలో పనిచేయటం, ఎన్నికల ప్రచారం మినహా సాధారణ పౌరులకు ఉండే అన్ని ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది.
అన్ని దేశాలతో పోలిస్తే అమెరికాలో ఈ కార్డులను అధికంగా ఇస్తోంది భారత్. 2019లో అమెరికాలో 90 వేల కార్డులు జారీ చేసింది. ప్రపంచమంతా కలిపి ఇప్పటివరకు 60 లక్షల ఓసీఐ కార్డుదారులు ఉన్నారు.
అయితే కరోనా సంక్షోభం దృష్ట్యా ఓసీఐ కార్డు ఉన్నవారు విదేశాల నుంచి స్వదేశానికి రాకుండా ఇటీవలే వారి దీర్ఘకాలిక వీసాలను నిలుపుదల చేసింది కేంద్రప్రభుత్వం.
ఇదీ చూడండి: వీసా ఉన్నా స్వదేశానికి రాలేని పరిస్థితి!