ఈ ఏడాది వేసవిలో పెళ్లి చేసుకుందామని ప్రణాళికలు వేసుకున్న వారికి లాక్డౌన్ రూపంలో పెద్ద షాక్ తగిలింది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన ఆంక్షలతో ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనైనా.. అనుకున్న ముహూర్తానికి వివాహం చేసుకోవాలనుకున్న వారు మాత్రం ఏదో ఓ మార్గంలో పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు.
సరిహద్దులోనే పెళ్లి
తమిళనాడు థేని జిల్లా కంబంకు చెందిన ప్రశాంత్, కేరళలోని కరపుజకు చెందిన గాయత్రి(19)కి లాక్డౌన్కు ముందే పెద్దలు నిశ్చితార్థం చేశారు. మే 24న వివాహం జరిపించాలని నిశ్చయించారు. అయితే దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్డౌన్ మే 31 వరకు పొడగించడం వల్ల వీరి పెళ్లికి ఆటంకం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు తప్పనిసరైన ఈ-పాస్ కోసం వరుడు, అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు పెళ్లి రోజు నాటికి ఈ-పాస్ మంజూరు కాలేదు. ఈ-పాస్ లేకపోయినా.. కొద్ది పాటి బంధువర్గంతో పెళ్లి కొడుకు తమిళనాడు-కేరళ సరిహద్దులోని కుములికి చేరుకున్నాడు. పాస్ లేనందున వారిని కేరళలోకి ప్రవేశించకుండా అధికారులు అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న వధువు కుటుంబసభ్యులు వండిపెరియార్ నుంచి కుములికి తరలివచ్చారు. కుములి పోలీస్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ సూచన ప్రకారం.. పెద్దలంతా కలిసి సరిహద్దులోనే కల్యాణం జరిపించారు. వివాహం అనంతరం వధూవరులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.