సార్వత్రిక ఎన్నికల ఫలితం కొద్ది గంటల్లో తేలనుంది. 7 విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 67.11 శాతం ఓటింగ్ నమోదైంది. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం.
తొలిసారి వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలలో వచ్చిన ఓట్ల లెక్కతో సరిపోల్చనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రకియ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 లక్షల 30 వేల పోలింగ్ కేంద్రాల్లో 20 వేల 600 కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే ఈవీఎం ఓట్ల లెక్కతో పోల్చనున్నారు.
18 లక్షల మంది...
మొత్తం 18 లక్షల మంది సర్వీస్ ఓటర్లున్నారు. ఈ సర్వీస్ ఓటర్లలో సాయుధ బలగాలు, కేంద్ర బలగాలు సహా ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసులు ఉన్నారు. ఇందులో 16 లక్షల 49 వేల మంది సంబంధిత రిటర్నింగ్ అధికారికి మే17 లోపు తమ పోస్టల్ బ్యాలెట్లు అందించారు. వీటిని ముందుగా లెక్కిస్తారు.
లెక్కింపు ప్రారంభించిన 2 గంటల్లోపే పోస్టల్ బ్యాలెట్ల గణన పూర్తికానున్నట్లు ఈసీ తెలిపింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చివర్లో జరగనుంది.
ఎలా లెక్కిస్తారు.?
గురువారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత ఈవీఎంలు. చివర్లో వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతారు. ఒక వేళ రెండింటికీ వ్యత్యాసముంటే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కనే పరిగణనలోకి తీసుకుంటారు.
స్లిప్పుల లెక్క ప్రక్రియకు అదనంగా 4 నుంచి 5 గంటల సమయం పట్టనుంది.
పటిష్ఠ బందోబస్తు...
ఎన్నికల సంఘం లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అదనపు కేంద్ర బలగాలను మోహరించింది.
542 స్థానాలకే...
మొత్తం 543 స్థానాలకు గాను 542 స్థానాల్లోనే ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని వేలూరు లోక్సభ నియోజకవర్గంలో భారీగా నగదు దొరకడం వల్ల ఈసీ ఇక్కడ ఎన్నికను రద్దు చేసింది. తదుపరి ఎన్నిక తేదీని ప్రకటించలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సహా చాలా మంది ప్రముఖులు ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు.