దక్షిణ ముంబయిలోని టార్డియో ప్రాంతంలో నివసిస్తున్న 36 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అతడిని వెంటనే స్థానిక కస్తుర్బా ఆసుపత్రిలో చేర్చినట్టు స్పష్టం చేశారు. వైద్యులు ఎప్పటికప్పుడు అతడిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.
ముంబయిలో గత మూడు రోజుల్లో ఇది నాలుగో కేసు. ఈ నెల 25న ముంబయి అంతర్జాతీయ విమానశ్రయంలో నిర్వహించిన థర్మల్ స్క్రినింగ్లో ముగ్గురు వ్యక్తులకు వైరస్ సోకిందన్న అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. వీరిని కూడా ప్రత్యేక విభాగంలో వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో జనవరి 19 నుంచి 24 వరకు విమానాశ్రయంలోని 2,700 ప్రయాణికులను థర్మర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే.. ఇప్పటి వరకు ఎవరికీ వైరస్ సోకినట్టు నిర్ధరించలేదని స్పష్టం చేశారు.
వైరస్ సోకితే..?
కరోనా వైరస్ సోకిన వారు తొలుత జలుబు వంటి లక్షణాలతో బాధ పడతారు. తర్వాత క్రమంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన నిమోనియా వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.
చైనాలో ఇప్పటి వరకు ఈ వైరస్ 80 మందిని బలితీసుకుంది. వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు.
ఇదీ చదవండి:ఆ చిన్నారి జ్ఞాపక శక్తికి అవార్డులు దాసోహం.. ఏడేళ్లకే డాక్టరేట్