కరోనా నివారణ చర్యగా కేంద్రం తీసుకొచ్చిన లాక్డౌన్ నిబంధనను మొదటినుంచీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. రాత్రి, పగలూ తేడా లేకుండా విధులకు అంకితమయ్యారు. అయితే.. ఈ సమయంలో తన 14 నెలల పాపతో కలిసి విధులు నిర్వర్తిస్తోంది గుజరాత్ కచ్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్.
ప్రస్తుత లాక్డౌన్ సమయంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ.. భౌతిక దూరం ప్రాధాన్యాన్ని వివరిస్తోంది అల్కాబెన్ దేశాయ్. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని, తన బాధ్యత తాను చేస్తున్నట్లు చెప్పింది.
'' నా భర్త విధుల్లో ఉన్నారు. పాపను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు. అందుకే నాతో పాటే తీసుకొస్తున్నాను.''
-అల్కాబెన్ దేశాయ్, పోలీసు కానిస్టేబుల్
త్రివేది చొరవతో...
అయితే.. పెట్రోలింగ్ సమయంలో ఆ మహిళా పోలీసును గమనించిన ఐజీపీ సుభాష్ త్రివేది, ఆమెకు మరింత సౌకర్యవంతమైన విధులు కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
'జనసమూహం నడుమ విధులతో.. ఆమెతో పాటు, తన కూతురికీ ప్రమాదం ఉన్నందున సురక్షిత వాతావరణం ఉన్నచోట విధులు కేటాయించాలని ఆదేశించాను' అని ఈటీవీ భారత్‌తో చెప్పుకొచ్చారు త్రివేది.
కరోనా తీవ్రత చిన్నపిల్లల్లో అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్న వేళ.. ఆ పోలీసు తన 14 నెలల పాపను రోజూ బయటకు తీసుకొస్తుండటం గమనార్హం.