దేశవ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి రాష్ట్రం కనీసం మూడు ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర మినహా.. అన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల రాజధానులు, సమీప ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది.
డ్రై రన్ నిర్వహణపై గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, కార్యదర్శి రాజీవ్ భూషణ్. డిసెంబర్ 28, 29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రై రన్లో వచ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడడంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ
వ్యాక్సినేషన్లో పాలుపంచుకునే ఆరోగ్య కార్యకర్తల జాబితా సిద్ధమైనట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. కొవిడ్ ప్లాట్‌ఫాంలో త్వరలోనే అప్లోడ్ చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల మాదిరిగానే ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చి వారిని వ్యాక్సినేషన్ కోసం సిద్ధం చేస్తామని వివరించారు. జాతీయ స్థాయిలో 2వేల మందికి శిక్షణ ఇచ్చిన తర్వాత.. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 700 జిల్లాల్లో ఈ శిక్షణ ఉంటుందన్నారు.