కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశాక ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం నెలకొంది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అనేక ఊహాగానాల నేపథ్యంలో ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. నూతన అధ్యక్షుడి ఎంపికపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7న ముగియనుండగా... అనంతరం వర్కింగ్ కమిటీ భేటీ నిర్వహిస్తోంది కాంగ్రెస్.
మే 25న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అనంతరం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పలువురు నాయకులు పార్టీని వీడారు. రాజ్యసభ ఎంపీ సజయ్ సింగ్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడి ఎంపికపై త్వరగా స్పష్టత ఇవ్వకపోతే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని సీనియర్ నేతలు శశిథరూర్, కరణ్ సింగ్ ఇటీవలే తమ అభిప్రాయాలను తెలిపారు.
ప్రియాంక వైపే అందరి చూపు
తన వారసత్వాన్ని గాంధీ కుటుంబ సభ్యులు కొనసాగించే అవకాశం లేదని రాహుల్ గాంధీ చెప్పినా... పార్టీ అధ్యక్ష బాధ్యతలు ప్రియాంక గాంధీ చేపడితే బాగుంటుందని శశి థరూర్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ప్రియాంక చేపడితే కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంటుందని పార్టీ సినియర్ నేత కరణ్ సింగ్ ఓ వార్త సంస్థ ముఖాముఖిలో చెప్పారు. ఆమె ఏకీకృత శక్తిగా అవతరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కశ్మీర్ వీడి వెళ్లాలని క్రికెటర్ ఇర్ఫాన్ బ్యాచ్‌కు ఆదేశం