2020 బిహార్ శాసనసభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కూటములు కట్టిన ప్రధాన పార్టీలన్నీ.. పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రస్తుతం ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి తమ లెక్కలు ప్రకటించింది. ఈ సర్దుబాటు ప్రకారం లాలూ ఆర్జేడీ కోటాకు 144 స్థానాలు కేటాయించగా, కూటమిలో మరో కీలకపక్షం కాంగ్రెస్‌కు ఊహించినదానికన్నా ఎక్కువగా... 70 సీట్లు దక్కాయి. ఝార్ఖండ్ జైలులో ఉన్న లాలూతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన వ్యూహాత్మక చర్చలే ఇందుకు కారణమంటున్నాయి విశ్లేషణలు.
కాంగ్రెస్ హవా..
మొత్తంగా సీట్ల పంపకంలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. గతంలో కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకుంది. మహాకూటమిలో కీలకంగా నిలిచింది. అయితే, ముందుగా కాంగ్రెస్‌కు 58కంటే ఎక్కువ స్థానాలు కేటాయించేందుకు ఆర్జేడీ విముఖత వ్యక్తం చేసింది. అంతకుముందు 2015లో జరిగిన ఎన్నికల్లో 41 స్థానాల్లో బరిలోకి దిగి.. 27చోట్ల విజయం సాధించింది హస్తం పార్టీ. కానీ, ప్రస్తుతం జైలులో ఉన్న లాలూపై ఒత్తిడి తెచ్చి ఎక్కువ స్థానాలు దక్కించుకున్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: బిహార్ బరి: ఆర్జేడీ-144, కాంగ్రెస్-70 స్థానాల్లో పోటీ
ఆర్జేడీకే నష్టం..
ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 150 స్థానాల్లో పోటీచేయాలని భావించింది. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్‌కే కాకుండా సీపీఐ (ఎంఎల్) పార్టీకి కూడా అనుకున్న 15స్థానాలకు అదనంగా 4 కేటాయించారు. ఇలా కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర నేతల సమక్షంలో మహాకూటమి సీట్ల పంపిణీ ఫార్ములాను ప్రకటించారు. ప్రస్తుతం ఆర్జేడీ వద్ద తమ కోటాలోంచే.. వీఐపీ, జేఎంఎం పార్టీలకు కొన్ని సీట్లు సర్దుబాటు చేయాలి. అలాగే, ఉప ఎన్నిక జరుగుతున్న వాల్మీకి నగర్ లోక్‌సభ స్థానం సైతం కాంగ్రెస్‌కే కేటాయించారు. వామపక్షాల్లోని సీపీఐకి-6, సీపీఎంకి-4 సీట్లు కేటాయించారు.
ఇదీ చూడండి: బిహార్ బీఎస్పీకి షాక్.. ఆర్జేడీలోకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
కూటమిలో కొత్త సమస్యలు
అయితే, కాంగ్రెస్‌కు అధిక స్థానాలు కేటాయించటం ఆర్జేడీకి కొత్త ఇబ్బందులు తీసుకొస్తోంది. కూటమిలో భాగంగా ఉన్న.. వీఐపీ, జేఎంఎం పార్టీలకు సీట్ల కేటాయింపులో కొత్త తలనొప్పులు ఏర్పడ్డాయి. ఇప్పటికే వీఐపీ నేత ముఖేష్ సాహ్ని తాను మహాకూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గౌరవప్రదమైన కేటాయింపులు జరపలేదని నిరసన వ్యక్తం చేశారు.
లాలూ ఆదేశాల తర్వాతే
మహా కూటమిలో సీట్ల సర్దుబాటు అంశంపై రోజుల తరబడి చర్చలు జరిగాయి. ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్.. ఆదేశాల తర్వాతే ఈ విషయంపై కొంత స్పష్టత వచ్చింది. మొత్తంగా.. మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ను ప్రకటించిన అనంతరం.. ఆయన నేతృత్వంలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
కొలిక్కిరాని ఎన్డీయే పంపకాలు
మరోవైపు అధికార ఎన్డీయే కూటమికి సంబంధించి.. సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ఎల్జేపీ పార్టీ వైఖరి వల్ల అనిశ్చితి కొనసాగుతోంది. త్వరలో సర్దుబాటు విషయంలో స్పష్టత తెచ్చుకునేందుకు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి.
ఇదీ చూడండి: బిహార్ ఎన్నికల్లో ఒంటరిగానే ఎల్జేపీ పోటీ!
ఇదీ చూడండి: బిహార్ బరిలో ఎంఐఎం- ఎన్డీఏ నెత్తిన పాలు పోస్తుందా?