మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల్లో వచ్చిన సానుకూల ఫలితాలతో కాంగ్రెస్ కొత్త శక్తిని పుంజుకుంది. అదే జోరును కొనసాగిస్తూ.. అధికార భాజపాను ఇరుకున పెట్టేందుకు హస్తం పార్టీ కార్యాచరణను ప్రకటించింది. డిసెంబర్లో మోదీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకు దిల్లీలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ఆర్సీఈపీ వంటి సమస్యలను ముఖ్యంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చర్చించి త్వరలో ర్యాలీ తేదీ ప్రకటిస్తారన్నారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల పార్టీ బాధ్యులతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
నవంబర్ 5-15 వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందని సుర్జేవాలా తెలిపారు. ఆర్సీఈపీ ఒప్పందానికి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.