రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించి శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరైన సచిన్ పైలట్ వర్గంపై వేటు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు రాజస్థాన్ సభాపతి సీపీ జోషి ద్వారా పైలట్ సహా 18 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇప్పించింది.
శుక్రవారమే గడువు
పార్టీ చీఫ్ విప్ ఫిర్యాదు మేరకు అసమ్మతి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు సీపీ జోషి తెలిపారు. శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి సోమవారం నాటి సీఎల్పీ భేటీకి గైర్హాజరు కావడం సహా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందున వారిని ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్‌జోషి స్పీకర్‌కు సమర్పించిన లేఖలో కోరారు.
ద్వారాలు ఇంకా తెరిచే..
నోటీసులు పంపించినప్పటికీ అసమ్మతి ఎమ్మెల్యేలకు పార్టీ ద్వారాలు తెరిచే ఉంచింది. ఇప్పటికైనా వారంతా పార్టీకి అనుకూలంగా మారాలని, ఏఐసీసీలో రాజస్థాన్ వ్యవహారాల బాధ్యుడు అవినాశ్ పాండే కోరారు. సచిన్ పైలట్ తన తప్పును తెలుసుకొనేలా దేవుడు సహాయం చేయాలని, భాజపా పన్నిన ఉచ్చు నుంచి బయటపడాలని కోరుకుంటున్నాని అవినాశ్ పాండే ట్వీట్ చేశారు.
పైలట్.. వెళ్లాల్సిన దారిపై సందిగ్ధం
అయితే తాను భారతీయజనతా పార్టీలో చేరటం లేదని తిరుగుబాటు నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నట్లు తెలిపారు. కొందరు నాయకులు తాను భాజపాలో చేరుతున్నానంటూ అపోహాలు సృష్టిస్తున్నారని అందులో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం వద్ద తనకు చెడ్డపేరు తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజస్థాన్ ప్రజలకు సేవ చేయనున్నట్లు తెలిపిన సచిన్ పైలట్ తన భవిష్యత్ కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
గహ్లోత్ ఆరోపణలు..
అయితే అసమ్మతి నేత సచిన్‌పైలట్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్వరాన్ని పెంచారు. భాజపాతో చేతులు కలిపి తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేలకు స్వయంగా భారీ ధనాన్ని ఇవ్వజూపేందుకు ప్రయత్నించారని, ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని గహ్లోత్ వెల్లడించారు.
గహ్లోత్ విమర్శలను తిరుగుబాటు వర్గంలోని మంత్రి రమేశ్ మీనా తిప్పికొట్టారు. గహ్లోత్ తన గత హయాంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తమకు, ఎంత ధనం ముట్టజెప్పారో చెప్పాలని ఆయన అశోక్ గహ్లోత్‌ను డిమాండ్ చేశారు.
'అనర్హతకు.. హాజరుకు లంకె కుదరదు'
అసమ్మతి వర్గ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయడంపై భాజపా స్పందించింది. శాసనసభాపక్ష భేటీకి హాజరు కాకపోవడం.. వారి అనర్హత వేటు వేయడానికి కారణం కాదని భాజపా రాజస్థాన్ అధ్యక్షుడు సతీశ్ పునియా అన్నారు. ఈ చర్య స్పీకర్ దురుద్దేశాన్ని చూపిస్తోందని ఈ అంశంలో చట్టపరమైన కోణాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఆయుధాల కొనుగోలులో సైన్యానికి మరింత స్వేచ్ఛ