పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో వచ్చే వారం ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తుండగా... బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పౌరసత్వ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. మతపరమైన హింస కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చి భారత్‌లో తలదాచుకున్న ముస్లిమేతరులకు దేశ పౌరసత్వం కల్పించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసింది కేంద్రం.
రాజధానిలో నిరసనల వెల్లువ..
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తులు నిన్న నిరసన ర్యాలీ చేపట్టారు. దేశానికి కావాల్సింది విద్య, ఉద్యోగాలని.. ఎన్ఆర్సీ అమలు కాదని ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించి నినదించారు.
జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్ఆర్సీ), పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ)లకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపడున్నారని... ఈ బిల్లులు రాజ్యాంగానికి విరుద్ధమని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సాయి బాలాజీ అన్నారు. దిల్లీలోని అంబేడ్కర్ భవన్ వద్ద విద్యార్థులంతా సంయుక్తంగా ఈరోజు నిరసనలు చేపడుతారని తెలిపారు.
ఇదీ చూడండి: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 'ప్రచార నినాదం' తెలుసా..?