పార్టీ ఆవిర్భావ వేడుకలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు అధినేత్రి సోనియా గాంధీ. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. 135 ఏళ్ల క్రితం స్థాపించిన పార్టీకి.... దేశం కోసం త్యాగాలే అధిక ప్రాధాన్యాంశాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పేర్కొంది. స్వాతంత్ర్య సమరం నుంచి ఇప్పటివరకు భారతదేశమే కాంగ్రెస్కు అత్యంత ప్రాధాన్యమని పార్టీ అధికారిక ట్విట్టర్లో వెల్లడించింది.
"దేశం కోసం త్యాగాలు చేయడమే కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యమైన అంశం. కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి భారత స్వాతంత్ర్యోద్యమం సహా అన్ని విషయాల్లో భారతదేశమే పార్టీకి తొలి ప్రాధాన్యం. ఐక్యత, న్యాయం, సమానత్వం, అహింస, స్వేచ్ఛకు 135 ఏళ్లు. ఇవాళ.. భారత జాతీయ కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.''
-ట్విట్టర్లో కాంగ్రెస్
కార్యకర్తల నిస్వార్థ సేవ..
ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోని, మోతీలాల్ వోరా, ఆనంద్ శర్మ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ కార్యకర్తలు నిస్వార్థ సేవ చేస్తున్నారని వారిని కొనియాడారు.
సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్
ఆవిర్భావ దినోత్సవం రోజున పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 'సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్' పేరిట దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ర్యాలీలకు పిలుపునిచ్చింది. అసోంలోని గువాహటిలో నిర్వహించనున్న ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా..!