మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటంపై కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా ఎంపీ అనంత కుమార్ హెగ్డే. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ లేదని తెలిసినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటం వెనుక ఓ పెద్ద కథ ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి అధీనంలోని రూ.40వేల కోట్లను కాపాడేందుకు ఈ నాటకం ఆడినట్లు వివరించారు.
కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అనంత కుమార్.
"మీ అందరికీ తెలుసు మా పార్టీ నేత ఫడణవీస్ మహారాష్ట్రలో కేవలం 80 గంటలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు.
ఈ డ్రామా మేము ఎందుకు చేశామని అనుకుంటున్నారా? రూ.40వేల కోట్లకుపైగా నిధులు ముఖ్యమంత్రి అధీనంలో ఉన్నాయి. ఒకవేళ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఆ నగదును అభివృద్ధి కోసం ఖర్చు చేయదు. ఇతర వాటి కోసం వినియోగిస్తుంది. అందుకే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని ముందుగానే ప్రణాళిక రూపొందించాం. ఈ డ్రామా అమలు చేశాం. అన్ని విధాలా సర్దుబాట్లు జరిగాయి. ఫడణవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. 15 గంటల్లోనే ఆ రూ. 40వేల కోట్లు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చారు. "
- అనంత కుమార్ హెగ్డే, భాజపా ఎంపీ
'మహా' డ్రామాపై ప్రధాని సమాధానం చెప్పాలి: కాంగ్రెస్
అనంతకుమార్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది కాంగ్రెస్. మహారాష్ట్రపై భాజపాకు ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ ఎంపీ వెల్లబుచ్చారని పేర్కొంది. ప్రజలు, రైతుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను కుట్ర పూరితంగా వెనక్కి తీసుకున్నారా? అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. దీనిపై ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తప్పుడు ప్రకటన: ఫడణవీస్
అనంతకుమార్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ఆయన చేసింది పూర్తిగా తప్పుడు ప్రకటన అని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు అడగలేదు, మహారాష్ట్ర ప్రభుత్వం ఏ నిధులను తిరిగి పంపలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: దిశ: 'నిబంధనలు కఠినతరం చేసేందుకు కేంద్రం సిద్ధం!