కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మేల్యేల రాజీనామాల అనంతరం.. రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, భాజపా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
ప్రభుత్వాన్ని కూల్చేందుకే.. భాజపా తమ ఎమ్మేల్యేలను బ్లాక్మెయిలింగ్ చేస్తూ.. భయపెడుతోందని ఆరోపించింది కాంగ్రెస్. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగా ఉందని.. అసెంబ్లీలో తమకే పూర్తి మెజారిటీ ఉందని పేర్కొన్నారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండురావు.
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం రాజీనామా చేశారు. బళ్లారి జిల్లా విజయనగర శాసనసభ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలి రాజీనామా పత్రాలను స్పీకర్ రమేశ్ కుమార్కు సమర్పించారు. దీనితో.. ప్రభుత్వ మనుగడ అనిశ్చితిలో పడింది. వారి రాజీనామాతో మాజీ సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర్, మంత్రి డి.కె. శివకుమార్ అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
మాకేం సంబంధం లేదు...
ఎమ్మేల్యేల రాజీనామాల గురించి తమకేం సంబంధం లేదని పేర్కొన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప. ఆందోళనంతా ప్రజల గురించేనని అన్నారు. 'ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే.. అది వారి సొంత వారి తప్పిదాల వల్లే కానీ.. తాము బాధ్యత వహించమని' తెలిపారు.
'సీఎం జాలీ ట్రిప్': యడ్యూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉండటంపై ఆరోపణలు చేశారు యడ్యూరప్ప. రాష్ట్రం కరవు పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. 'జాలీ ట్రిప్' చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పర్యటనకు వెళ్లడానికి.. ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు.
ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎమ్మేల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్తి బయటపడిందని ఎద్దేవా చేశారు.