ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు యూపీఏ హయాంలో ఆరు లక్షిత దాడులు జరిగినట్టు కాంగ్రెస్ నేడు ప్రకటించింది. అయితే సైనిక చర్యలపై ఎన్నడూ రాజకీయం చేయలేదని హస్తం పార్టీ వెల్లడించింది. ఆ ఆరు లక్షిత దాడులకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ ప్రతినిధి రాజీవ్ శుక్లా వెల్లడించారు.
కాంగ్రెస్ చెప్పిన లక్షిత దాడుల వివరాలు
- భట్టల్ సెక్టార్- పూంచ్ (జూన్ 19, 2008)
- శారదా సెక్టార్- కేల్ (ఆగస్టు 30- సెప్టెంబర్ 1, 2011)
- సావన్ పాత్రా చెక్‌పోస్ట్ (జనవరి 6, 2013)
- నజాపిర్ సెక్టార్ (జులై 27-28, 2013)
- నీలమ్ లోయ (ఆగస్టు 6, 2013)
- మరో లక్షిత దాడి (డిసెంబర్ 23, 2013)
- లక్షిత దాడులపై గత ప్రభుత్వాలు ఎన్నడూ మాట్లాడలేదని... కానీ మోదీ సర్కారు ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు శుక్లా.
భజన ఆపండి...
మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించడం వెనుక గత ప్రభుత్వాల కృషి, విదేశాల సహకారం ఉందన్నారు శుక్లా. ప్రతీ విషయానికి 'మేము చేశాం... మేము చేశాం' అని భజన చేయడం మానుకోవాలని భాజపా నేతలకు శుక్లా సూచించారు.
"మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం కోసం 15 ఏళ్లుగా నిరంతర ప్రక్రియ జరుగుతోంది. ఏ ఒక్క సర్కారుకో ఈ విజయాన్ని కట్టబెట్టాల్సిన అవసరం లేదు. విదేశీ ప్రభుత్వాలు ఇందుకు సహకరించాయి. వారందరికీ ధన్యవాదాలు. దేశంలో ప్రభుత్వాలు మారినా... ప్రతీ సర్కారు ఐరాసతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది. ఈ విషయంలో నిజాన్ని గుర్తించిన వారికి కృతజ్ఞతలు. కానీ.. ఒక సర్కారుకు ఈ విజయాన్ని కట్టబెట్టడం సరికాదు. ప్రతీ విషయానికి మేము చేశాం... మేము చేశాం అని ముందుకొచ్చి చప్పట్లు కొడతారు. దయచేసి ఆపండి."
--- రాజీవ్ శుక్లా, కాంగ్రెస్ ప్రతినిధి.
ఆ ప్రకటన మోసపూరితం...
మన్మోహన్ సింగ్ హయాంలో లక్షిత దాడులు జరిగాయన్న కాంగ్రెస్ ప్రకటనపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. ఆ ప్రకటన మోసపూరితమేనని... ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల హస్తం పార్టీ ఇప్పడు చింతిస్తోందని ఆరోపించింది.
ఇదీ చూడండి: ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే: సీబీఎస్ఈ టాపర్