కరోనా లాక్డౌన్ జీవనోపాధి పైనే కాదు జీవనశైలిపైనా ప్రభావం చూపించింది. ఎక్కువగా కళాశాల విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తాయి. వారిలో కోపం, అసహనం, నిరాశ పెరిగాయి. మానసిక ఆరోగ్యంపై కృషి చేసే ఆన్లైన్ సంస్థ యువర్ దోస్త్ లాక్డౌన్ సమయంలో వివిధ వృత్తుల వారి మానసిక పరిస్థితిపై అధ్యయనం చేసింది. లాక్డౌన్ ప్రకటించిన మార్చి 25 నుంచి అన్లాక్-1 ప్రారంభమైన జూన్ 7 వరకు 8 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. తొలుత కళాశాల విద్యార్థులు, ఆ తరువాత ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురయినట్లు తేలింది. లాక్డౌన్ ప్రకటించిన తొలినాళ్లలో విద్యార్థులు సంతోషంగానే గడిపారు కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో మార్పులు కనిపించాయి. భయం, ఆందోళన 41 శాతం మేర పెరిగింది.
అసహనం 54 శాతం మేర, నిరాశ 27 శాతం, విచారం 17 శాతం, ఒంటరితనం 38 శాతం మేర పెరిగాయి. ఇంటికే పరిమితం కావడం వల్ల చదువులు, కళాశాలల్లోని వ్యాపకాలనూ కోల్పోయినట్లు భావించారు. తల్లిదండ్రుల చెంతనే ఉండడం వల్ల స్వేచ్ఛ లేకుండాపోయిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల్లోనూ ఇలాంటి భావోద్వేగాలు కనిపించాయి. తరువాత పరిస్థితి ఏమిటీ? అన్న ప్రశ్న వారిలో కలవరం కలిగించింది. భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమయింది. ఇంటి దగ్గరే ఉండిపోవడం వల్ల వారి జీవనశైలిలోనూ మార్పు కనిపించింది. మొత్తంగా 33 శాతం మంది తీవ్ర ఒత్తిడికి, 51 శాతం మంది ఓ మోస్తరు ఒత్తిడికి గురయ్యారు. రానున్న రెండు నెలల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. కొంతమంది మాత్రం ఇంటి భోజనం తినగలిగామని, కుటుంబంతో కాలం గడిపామని సంతోషం వ్యక్తం చేశారు.