వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019ను బుధవారం రాజ్యసభలో ప్రవేశపట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇతర పార్టీల మద్దతుతో బిల్లును ఆమోదింపచేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది అధికార భాజపా.
పార్లమెంట్ దిగువసభలో అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నందున సోమవారం సుదీర్ఘ చర్చ అనంతరం పౌరసత్వ బిల్లు ఆమోదం పొందింది. ఎన్డీఏకి మద్దతుగా ఇతర పార్టీలు నిలుస్తున్న కారణంగా రాజ్యసభలోనూ ఈ బిల్లు నెగ్గుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం రాజ్యసభలో 238 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏకి 105 మంది బలం ఉంది. అందులో భాజపా 83, జనతాదళ్(యూ) 6, శిరోమణి అకాలి దళ్ 3, ఎల్జేపీ, ఆర్పీఐ(ఏ)కు తలాఒకటి, 11 మంది నామినేటేడ్ ఎంపీలు ఉన్నారు.
మొత్తం 127 మంది సభ్యుల మద్దతు!
బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలనే లక్ష్యంతో ఉంది భాజపా. ఇప్పటికే అన్నాడీఎంకే(11), బీజేడీ(7), వైకాపా(2), తేదేపా(2)తో చర్చలు చేపట్టింది. బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ పార్టీలన్నీ లోక్సభలో బిల్లుకు మద్దతుగా నిలిచిన కారణంగా రాజ్యసభలోనూ అండగా నిలుస్తాయనే విశ్వాసంతో ఉంది భాజపా.
ఈ నాలుగు పార్టీల మద్దతుతో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి 127 మంది సభ్యుల బలం ఉంటుంది. ఇది సాధారణ మెజారిటీ 120 కన్నా ఎక్కువ. కాబట్టి బిల్లు రాజ్యసభలోనూ నెగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుపై ఈశాన్యాన పెల్లుబికిన ఆగ్రహం