15వ దశాబ్దం నుంచి నేటికీ చర్చనీయాంశంగా ఉన్న అత్యంత సున్నితమైన కేసు 'అయోధ్య భూవివాదం'. 2.77 ఎకరాల భూమిపై తమదంటే తమదే హక్కు అని హిందూ, ముస్లిం వర్గాలు ఎప్పటినుంచో వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలం నుంచి నానుతున్న ఈ వివాదం పూర్వాపరాలేమిటో ఓ సారి చూద్దాం.
అయోధ్య భూవివాదం సాగిందిలా...
- 1528 : మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని మీర్ బాఖీ.. బాబ్రీ మసీదును నిర్మించారు.
- 1885 : రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు తొలిసారి కోర్టు మెట్లెక్కింది. మసీదు వెలుపల మండపాన్ని నిర్మంచేందుకు అనుమతివ్వాలని మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం కొట్టివేసింది.
- 1949 : వివాదాస్పద మసీదు లోపల రాముడి విగ్రహాలు వెలిశాయి. వీటిని హిందూ సంఘాలే పెట్టాయని ముస్లిం సంస్థలు ఆరోపించాయి.
- 1950 : రాముడికి పూజలు చేసుకునేందుకు అనుమతించాలని గోపాల్ సిమ్లా విశారథ్, పరమహంసా రామచంద్రదాస్.. ఫైజాబాద్ జిల్లా కోర్టులో దావా వేశారు.
- 1959 : అయోధ్య వివాదాస్పద స్థలంపై తమకే హక్కుందని కోర్టును ఆశ్రయించిన నిర్మోహి అఖాడా సంస్థ.
- 1981 : అయోధ్య వివాద స్థలం తమదేనని ముస్లిం వర్గానికి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున కోర్టులో వ్యాజ్యం దాఖలు.
- 1986 ఫిబ్రవరి 1 : మసీదులో హిందూ వర్గం వారు పూజలు చేసుకునేందుకు అనుతించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసిన స్థానిక కోర్టు.
- 1992 డిసెంబర్ 6 : బాబ్రీ మసీదు కూల్చివేత.
- 2002 ఏప్రిల్ : వివాదాస్పద భూమిపై ఎవరికి హక్కుందో తేల్చేందుకు అలహాబాద్ హైకోర్టులో విచారణ మొదలు.
- 2010 సెప్టెంబర్ 30 : వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలు మూడు సమాన భాగాలుగా పంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు.
- 2011 మే 21 : అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.
- 2017 ఆగస్టు 7 : అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.
- 2018 జులై 20 : అయోధ్య తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.
- 2018 డిసెంబర్ 24 : 2019 జనవరి 4న మరోమారు అయోధ్య వ్యాజ్యాలపై విచారణ చేపడతామన్న సుప్రీం.
- 2019 జనవరి 8 : అయోధ్య వ్యాజ్యాలపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. సీజేఐతో పాటు సభ్యులుగా జస్టిస్ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్.
- 2019 జనవరి 25 : కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్. జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నజీర్‌తో కూడిన నూతన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.
- 2019 జనవరి 29 : వివాదాస్పద భూమి చుట్టూ ఉన్న 67 ఎకరాల స్వాధీన భూమిని వాటి యజమానులకు ఇవ్వాల్సిందిగా సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం.
- 2019 మార్చి 8 : వివాద పరిష్కారానికి సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురితో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు.
- 2019 ఏప్రిల్ 9 : 67 ఎకరాల భూమిని యజమానులకు అప్పగించాలన్న కేంద్రం పిటిషన్‌ను వ్యతిరేకించిన నిర్మోహి అఖాడా.
- 2019 మే 9 : సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పణ.
- 2019 మే 10 : మధ్యవర్తిత్వ కమిటీ తన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించిన సుప్రీం.
- 2019 ఆగస్టు 1 : పూర్తి నివేదికను సుప్రీంలో సీల్డ్ కవర్లో సమర్పించిన మధ్యవర్తిత్వ కమిటీ.
- 2019 ఆగస్టు 2 : అయోధ్య వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైనందున... ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీం నిర్ణయం.
- 2019 ఆగస్టు 6 : అయోధ్య వ్యాజ్యాలపై సుప్రీంలో రోజువారీ విచారణ ప్రారంభం.
- 2019 అక్టోబర్ 16 : ముగిసిన వాదనలు... తీర్పు వాయిదా.
- 2019 నవంబర్ 9: అయోధ్య తీర్పు