తూర్పు లద్దాఖ్ సరిహద్దు వివాద సమస్యను పరిష్కరించుకునేందుకు సైనిక కమాండర్ స్థాయి చర్చల్లో సాధించిన పురోగతిని చైనా స్వాగతించింది. వివాద పరిష్కారానికి ఇప్పటి వరకు కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు ఇరు వర్గాలు పని చేస్తున్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు. భారత్‌కూడా సైనిక, దౌత్య మార్గాల ద్వారా సమాచారాన్ని పంచుకుని.. ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలన్న లక్ష్యం కోసం పని చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రక్షణమంత్రి పర్యటన..
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికులను భారీగా మోహరించడం, ప్రతిగా భారత్ అదే స్థాయిలో బలగాలను సరిహద్దుకు తరలిస్తున్న నేపథ్యంలో లద్దాఖ్‌లో శుక్రవారం పర్యటించనున్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సైనిక దళాల ప్రధానాధికారి ఎం ఎం నరవాణే సహా సైనికాధికారులతో కలిసి అక్కడి భద్రతా పరిస్థితి, బలగాల సన్నద్ధతపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. గత నెలలో చైనాతో ఘర్షణలో 21 మంది సిబ్బందిని కోల్పోయిన సైనిక బలగాల్లో తన పర్యటన ద్వారా నైతిక స్థైర్యం నింపనున్నారు రాజ్‌నాథ్. చైనాతో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు సహా ఆ దేశానికి వ్యతిరేకంగా కేంద్రం వరుస చర్యలు తీసుకుంటున్న సమయంలోనే రాజ్‌నాథ్ లద్దాఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.