వ్యవసాయ రంగానికి మేలు చేస్తాయని ఎన్డీఏ సర్కార్ చెబుతున్న వ్యవసాయ బిల్లులు.. ఆహార భద్రత వ్యవస్థను బలహీనపరుస్తాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 20న రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టినపుడు.. వాటిని చట్టరూపం దాల్చకుండా కలిసి కట్టుగా అడ్డుకుందామని విపక్షాలను కోరింది కాంగ్రెస్ పార్టీ.
అవన్నీ అసత్యాలు...
కనీస మద్దతు ధర, సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థల మూల సూత్రాల ఆధారంగానే.. 2019 ఎన్నికల ప్రణాళికను రూపొందించామని మాజీమంత్రి చిదంబరం స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీని తాము నెరవేరుస్తున్నామంటూ.. ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా అధికార ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీ సర్కారు కార్పొరేట్లకు, వ్యాపారులకు లొంగిపోయిందని ఆరోపించిన చిదంబరం... రైతుల వైపు నిలబడాలో లేదా భాజపాకు మద్దతు పలకాలో తేల్చుకోవాలని రాజకీయపార్టీలను కోరారు.
ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో.. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఇందులో రెండు కొత్త బిల్లులు కాగా.. మరొకటి సవరణ బిల్లు. అధికార పక్షం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు.. సెప్టెంబర్ 17న లోక్‌సభలోనూ ఆమోదం లభించింది. అయితే ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మిత్ర పక్షాలు ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి.
ఇదీ చూడండి: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?