ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) మరణించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నేడు తుది శ్వాస విడిచారు.
మే 9న అజిత్ జోగికి గుండెపోటు రాగా... రాయ్‌పుర్‌లోని శ్రీ నారాయణ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినా మరో 2 సార్లు గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు.
ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన జోగి 1986లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవులు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ తొలి సీఎంగా పనిచేసిన ఆయన 2016లో కాంగ్రెస్ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు.
వెంకయ్య, మోదీ విచారం
అజిత్ జోగి మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. జోగి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. పేదలు, ముఖ్యంగా గిరిజనుల జీవితాల్లో సకారాత్మక మార్పు తెచ్చేందుకు అజిత్ ఎంతో కృషి చేశారని కొనియాడారు మోదీ.