చంద్రయాన్-2 ప్రయోగంలో మరో ఘట్టానికి ఇస్రో సన్నద్ధమయింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్‌ను వేరు చేసే ప్రయోగం నేడు మధ్యాహ్నం చేపట్టనుంది. ప్రస్తుతం చంద్రయాన్-2 నౌక చంద్రుడి చుట్టూ 119x127 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తోందని, వ్యవస్థ పనితీరు సాధారణంగానే ఉందనే ప్రకటించింది.
చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్‌ను వేరుచేసే ప్రక్రియను మధ్యాహ్నం 12.45 నుంచి 13.45 సమయంలో చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. దీని తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేందుకు వీలుగా ల్యాండర్ విక్రమ్‌కు రెండు డీ ఆర్బిట్ విన్యాసాలు చేపడతారు.
సెప్టెంబరు 3న మొదటి విన్యాసం ఉదయం 9 నుంచి 10గంటల మధ్య, 4న రెండో డీ ఆర్బిట్ విన్యాసం ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య చేపట్టనున్నట్లు ఇస్రో ప్రణాళిక వేసింది. సెప్టెంబరు 7న తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో విక్రమ్.. చంద్రుడి ఉపరితలాన్ని తాకనున్నట్లు ఇస్రో అధికారిక వెబ్సైట్లో తెలిపింది.
ఇదీ చూడండి: చంద్రయాన్-2కు ఆఖరి కక్ష్య కుదింపు