అన్లాక్ 4లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతులు ఇచ్చింది కేంద్రం. ఈ నేపథ్యంలో మెట్రో సేవల ప్రారంభానికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (హెచ్యూఏ) బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
మార్గదర్శకాలకు తుది రూపు ఇచ్చేందుకు మంగళవారం.. దేశంలోని మెట్రో కార్పొరేషన్ల ఎండీలతో సమావేశమయ్యారు మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
''మెట్రో సంస్థల ఎండీల సూచనలు, కరోనా నిబంధనలను అనుసరించి ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేశాం. దీనిపై కేంద్ర హోంశాఖతో బుధవారం చర్చిస్తాం. హోంశాఖతో సంప్రదించిన అనంతరం తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తాం. మెట్రో సేవలు ప్రారంభమైన తర్వాత మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం తప్పనిసరి. కరోనా నిబంధనలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలి. ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తాం.''
- అధికారవర్గాలు.
దేశవ్యాప్తంగా 17 మెట్రో కార్పొరేషన్స్ ఉన్నాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి.. స్థానిక అవసరాలకు అనుగుణంగా వారి వారి కార్పొరేషన్స్లో సూచనలు జారీ చేయనున్నారు.
ఇదీ చూడండి: అన్లాక్-4: 7 నుంచి మెట్రో కూత- థియేటర్లకు నో