జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన 15 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా జమ్ముకశ్మీర్‌లో భూమి కొనుగోలుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ అభివృద్ధి చట్టంలోని సెక్షన్ 17లో ఉన్న ఆ రాష్ట్రానికి చెందిన శాశ్వత వ్యక్తి అనే పదాన్ని తొలగించింది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌కు చెందని వ్యక్తులకు అక్కడ భూమి కొనుగోలులో చట్టబద్ధంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కొత్త నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని ఇతర కార్యకలాపాలకు బదిలీ చేయడానికి అనుమతించరు. అయితే విద్య, వైద్య సదుపాయాల కోసం వ్యవసాయ భూమిని బదలాయించవచ్చు. ఈ చట్ట సవరణను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ఇది తమకు అంగీకారయోగ్యం కాదని తెలిపారు. పేదలు సహా తక్కువ భూమి ఉన్న జమ్ముకశ్మీర్ ప్రజలకు దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఒమర్ అబ్దుల్లా అన్నారు.