నేడు, రేపు కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రవాసీ భారతీయ కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర హోదా, సహాయ మంత్రులు హాజరు కానున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ భేటీలో కీలక విధానాలను కేబినెట్‌కు కార్యదర్శుల బృందం మంత్రిమండలికి వివరించనుంది. కొత్త విధానాల అమలు ప్రణాళికలపైనా మంత్రిత్వ శాఖలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. 2024 నాటికి లక్ష్యాలు చేరుకొనే అంశంపై ప్రధానమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మంత్రివర్గ విస్తరణ
కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మిత్రపక్షమైన జేడీ(యూ)కు స్థానం కల్పించడం కోసం ప్రధాని మోదీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని వెల్లడించాయి. కలిసి పోటీ చేసినా మంత్రివర్గంలో చేరడానికి గతంలో జేడీ(యూ) సుముఖత చూపలేదు. ఒక్క కేబినెట్ మంత్రి పదవే ఇస్తామని తెలపడం వల్ల జేడీ(యూ) అప్పట్లో తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. తాజాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఓ సహాయ మంత్రి పదవి, మరో రెండు సహాయ మంత్రుల పదవులు ఇవ్వడానికి భాజపా ముందుకు రావడంతో అందుకు సమ్మతి తెలిపినట్లు సమాచారం.
ఇదీ చదవండి:'మువ్వన్నెల జెండాతో.. ప్రపంచ రికార్డు నెలకొల్పేస్తాం!'