కరోనా కారణంగా ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన శ్రీ అమర్‌నాథ్ దేవాలయ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వర్చువల్ భేటీలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము, పోలీసు, పరిపాలనా విభాగంలో ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా.. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కూడా ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా అమర్‌నాథ్ యాత్ర వ్యవధిని కుదించారు.
ఇంతకముందు కరోనా దృష్ట్యా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను జులై 13న సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా నేపథ్యంలో టెలివిజన్, ఇంటర్నెట్ ద్వారా భక్తులకు ప్రత్యక్ష దర్శనం కల్పించాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది
ఇదీ చూడండి: గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్ఐఆర్