కర్ణాటక ఉల్లాల్ నగరంలో మహ్మద్ నిఫాజ్(20) అనే యువకుడు ఓ ప్రైవేట్ బస్సును దొంగలించాడు. ఏకంగా 65 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
ఇదీ జరిగింది...
ఓ ప్రైవేట్ బస్సు ఉల్లాల్ నుంచి మంగుళూరుకు వెళ్లాల్సి ఉంది. డ్రైవర్ రాత్రి పూట ఉల్లాల్ బస్ స్టేషన్లో పార్క్ చేశాడు. తెల్లవారుజామున క్లీనర్ యథావిధిగా బస్సును శుభ్రపరచటానికి వచ్చాడు. అక్కడ బస్సు కనపడకపోవటం చూసి నివ్వెరపోయాడు. వెంటనే యజమానికి చెప్పాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా తెలిసింది...
నిఫాజ్ బస్సు డ్రైవ్ చేసుకుంటూ ఉల్లాల్ నుంచి ఉడుపి వరకు వెళ్లాడు. దారి మధ్యలో తండ్రికి ఫోన్ చేశాడు. బస్సు వేసుకుని తీర్థయాత్రకు వెళ్తున్నట్లు చెప్పాడు.
నిఫాజ్ తండ్రి వెంటనే పోలీసులకు అసలు విషయం చెప్పాడు. పోలీసులు బస్సును ఎట్టకేలకు గుర్తించారు. నిఫాజ్ను తిరిగి ఉల్లాల్ తీసుకొచ్చారు.
65 కిలోమీటర్ల ప్రయాణంలో బస్సు స్వల్పంగా దెబ్బతింది. డివైడర్లను ఢీకొట్టడమే ఇందుకు కారణమని తెలిసింది.
నిఫాజ్ వృత్తిరీత్యా దొంగ కాదని, మానసిక పరిస్థితి సరిగా లేకనే ఇలా చేశాడని పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి : యాచకుడి వద్ద లక్షలు- సంపద చూసి పోలీసులు షాక్