భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా మరికొద్ది గంటల్లో భాజపా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల మధ్య ఆయన నామపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంది. నడ్డా తప్ప ఎవరూ నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఆయన ఎన్నిక లాంఛనం కానుంది.
మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత భాజపా జాతీయ అధ్యక్ష పదవికి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ అమిత్ షా చేతిలో ఉన్న కమలం పార్టీ పగ్గాలు నడ్డా చేతిలోకి వెళ్లనున్నాయి.
కమలం పార్టీ నిబంధనల ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిశాక అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భాజపా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసినందున నూతన అధ్యక్షుడి ఎన్నికను నిర్వహిస్తున్నారు.
నాయకత్వ విశ్వాసం
2019 జులైలోనే జేపీ నడ్డాను భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమించారు. అప్పుడే భాజపా తదుపరి అధ్యక్షుడు నడ్డానే అన్న విషయం స్పష్టమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు కేంద్ర మంత్రివర్గంలోనూ పనిచేసిన నడ్డా... కమల దళాన్ని సమర్థంగా నడిపిస్తారని భాజపా అగ్ర నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. మోదీ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన నడ్డాకు పార్టీలో చాలా హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్ విజయం
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా సమర్థంగా పనిచేసి సత్ఫలితాలు రాబట్టారు నడ్డా. ఆ ఎన్నికల్లో భాజపా 80 లోక్‌సభ స్థానాల్లో 62 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా కూడా ఆయన పనిచేశారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా నడ్డాకు స్వాగతం పలుకుతోంది
వ్యతిరేక పవనాల్లో ప్రయాణం
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా- మోదీ ద్వయం భాజపాను తిరుగులేని శక్తిగా ఆవిష్కరించింది. 2024లో భాజపాను తిరిగి అధికారంలోకి తెచ్చే బృహత్తర బాధ్యత నడ్డాపై ఉంది.
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికపై కొన్ని రాష్ట్రాల్లో భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో నడ్డా... పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇదీ చదవండి: క్రికెట్‌తో అలరించిన భారత ప్రధాన న్యాయమూర్తి