కన్నడ నాట నూతనంగా అధికారం చేపట్టిన భాజపా సర్కారు.. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విశ్వాస పరీక్షలో నెగ్గి.. అధికారంలోకి వచ్చిన 3 రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది యడియూరప్ప ప్రభుత్వం.
2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ వస్తోంది. తొలుత అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఈ పద్ధతిని తీసుకొచ్చారు. అనంతరం.. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వమూ కొనసాగించింది.
'కొడగు'లో అల్లర్లు...
విరాజ్పేట్ ఎమ్మెల్యే కె.జి. బోపయ్య అభ్యర్థన మేరకు భాజపా సర్కార్ ఈ వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొడగు జిల్లాలో ఈ జయంతి ఉత్సవాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున రద్దు చేయాలని సీఎం యడియూరప్పకు లేఖలో తెలిపారు బోపయ్య.
తొలిసారి వేడుకలు నిర్వహించిన 2015లో ఆందోళనలు, అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలోనే వీహెచ్పీ కార్యకర్త కుత్తప్ప ప్రాణాలు కోల్పోయారు.
ఒక మతం పట్ల పక్షపాతంగా వ్యవహరించేవారనే కారణంతో.. టిప్పు సుల్తాన్ ఉత్సవాలను మొదటి నుంచీ భాజపా సహా మితవాద సంస్థలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.
ఖండించిన సిద్ధరామయ్య..
భాజపా చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య. భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు వ్యతిరేకమని.. అందుకే టిప్పు జయంతి వేడుకలను రద్దు చేసిందని ఆరోపించారు.
''టిప్పు జయంతి వేడుకలను నేనే ప్రారంభించా. వరుసగా 3 సంవత్సరాలు నిర్వహించాం. కర్ణాటక ప్రజలూ అంగీకరించారు. టిప్పు సుల్తాన్.. బ్రిటీష్ ప్రజలకు, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. నా దృష్టిలో దేశంలోని తొలి స్వాతంత్ర్య సమరయోధుడు టిప్పు. ఈ కారణంగానే.. మేం జయంతి ఉత్సవాలు ప్రారంభించాం. టిప్పు మైనార్టీకి చెందిన వ్యక్తి. దేశంలోని మైనార్టీలకు భాజపా వ్యతిరేకం. కాషాయ పార్టీ ప్రజలూ లౌకిక వాదులు కాదు. వారి భావజాలమూ లౌకిక వాదానికి వ్యతిరేకం. ఈ చర్యను నేను పూర్తిగా ఖండిస్తున్నా.''
- సిద్ధరామయ్య, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత
తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప. టిప్పు జయంతి ఉత్సవాల రద్దుకు కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని.. గత అల్లర్లను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ భేటీ అనంతరం వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.