ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా బిహార్‌లో ఆర్జేడీకి షాకుల మీదు షాకులిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు అధికార జేడీయూలో చేరాగా.. ఇప్పుడు ఏకంగా ఆ రాష్ట్ర ఆర్జేడీ ఉపాధ్యక్షడు పదవికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి, బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు విజేంద్ర యాదవ్ శనివారం ప్రకటించారు. పార్టీలో సీనియర్ నేతలకు సరైన గౌరవం లభించడం లేదని ఆరోపించారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒకప్పటిలా లేరని, పూర్తిగా మారిపోయారని చెప్పారు.
" పార్టీలో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 30 ఏళ్ల పాటు పార్టీలో ఉన్నా. లాలూతో కలిసే రాజకీయ జీవితం ప్రారంభించా. ఆయనతో కలిసే ముగించాలనుకున్నా. కానీ ఆయన మారిపోయారు. 1990,2000 కాలంలో ఉన్నట్లుగా లేరు. అందుకే నేను కూడా మారాల్సి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్తగా వచ్చిన యువకులకే అవకాశాలిస్తున్నారు. కార్యక్రమాల్లో పాల్గొన్నప్పడు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరట్లేను. అవకాశం ఉంటే నాకు సరైన ప్రధాన్యం ఇచ్చే పార్టీలో చేరుతా. "
-విజేంద్ర యాదవ్, ఆర్జేడీ మాజీ ఉపాధ్యక్షుడు.
వచ్చే నెలలో బిహార్ శాసన మండలిలోని 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ తరుణంలో ముఖ్య నేతలు పార్టీని వీడటం ఆర్జేడీకి ఆందోళన కల్గించే విషయమే. లాలు ప్రసాద్‌తో పాటు, పార్టీలోని సీనియర్ నేతలకు విజేంద్ర యాదవ్ అత్యంత సన్నిహితులు.