ఇంటి అవసరాల కోసం మనం చాలా నీటిని ఉపయోగిస్తాం. ఈ నీళ్లు భూగర్భం నుంచి, జలాశయాల నుంచి వస్తుంటాయి. అయితే పూర్తిగా మన ఇంటిపైనే పడే వర్షపు నీటితో మాత్రమే ఇంటి పనుల చేసుకుంటే ఎలా ఉంటుంది? దీనితో పాటు భూగర్భ జలం స్థాయి పెంచితే బాగుంటుంది కదా? వినటానికి ఆసక్తిగా ఉన్న ఈ ఆలోచనను బెంగళూరులోని ఓ వ్యక్తి ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్వతహాగా ఆర్కిటెక్ట్ అయిన విశ్వనాథ్... వర్షపు నీరు బొట్టుబొట్టునూ ఒడిసిపడతారు. వివిధ ట్యాంకులలో నింపుతారు. తాగటానికి, వంటకు వీటిని మాత్రమే ఉపయోగిస్తారు. స్నానం లాంటి పనులు నుంచి వచ్చిన నీళ్లను రీసైక్లింగ్ చేసి పైకప్పు, ఇంటి ప్రాంగణంలో పెంచుతున్న కూరగాయల మొక్కలకు వాడుతుంటారు. ఇలా సంవత్సరంలో 300 నుంచి 320 రోజులు చేస్తానని ఆయన చెబుతున్నారు.
వర్షపు నీటిని శుద్ధి చేసి సూర్యరశ్మి, గాలి రాని ట్యాంకులలో నింపుకుంటే... కలుషితం కాకుండా సంవత్సరం వరకు ఉంటాయి. మొత్తం బెంగళూరు ఈ పద్ధతిని అనుసరించి, వర్షపు నీటి ద్వారా భూగర్భజలం స్థాయి పెంచేందుకు మిలయన్ బావులు తవ్విస్తే... ఎప్పటికీ నీటి సమస్య రాదు.
- విశ్వనాథ్, ఆర్కిటెక్ట్
విశ్వనాథ్ ఇంట్లో ఉన్న టాయిలెట్‌కు నీరే అవసరం లేదు. ఇందులో నుంచి ఎరువును కూడా తయారు చేసి మొక్కలకు వాడుతుంటారు. ఈయన ఇంట్లో ఒకే ఒక టేబుల్ ఫ్యాన్ ఉండటం విశేషం. సహజ గాలి, వెలుతురుతోనే జీవనం సాగిస్తారు. వంటతో పాటు ఇంట్లో ప్రతి దానికీ సౌర విద్యుత్‌నే ఉపయోగిస్తున్నారు.