గణేశ్ ఉత్సవాలంటే దేశవ్యాప్తంగా ఆ జోరే వేరు. 10 రోజుల పాటు ఉండే ఆ కోలాహలమే వేరు. మరో మూడు రోజుల్లో వినాయక చవితి వస్తోందంటే.. ఆ సందడే వేరు.
కానీ కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. వైరస్ దెబ్బకు అంతర్జాతీయ సమావేశాలే ఆన్లైన్లో జరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు గణేశుడి వేడుకలు కూడా ఆన్లైన్ బాటపడుతున్నాయి. మండపాలు సిద్ధం చేయాల్సిన వారు ఇప్పుడు ఫేస్బుక్లో దర్శనాలకు.. వేలాది మందికి ప్రసాదాలు తయారు చేయాల్సిన వారు గూగుల్, జూమ్‌లో హారతిని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
కళ తప్పిన ఉత్సవం...
ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు పూర్తిగా కళతప్పాయి. ముఖ్యంగా వేడుకలను ఘనంగా నిర్వహించే.. మహారాష్ట్రలో అసలు సందడే లేదు. దేశ రాజధాని దిల్లీలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్సీఆర్లోని పురాతన మండపాల్లో మరాఠీ మిత్ర మండల్ ఒకటి. ఈ ఏడాది ఇక్కడ గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. 10 రోజుల పాటు జరగాల్సిన ఉత్సవాన్ని కేవలం ఒకటి, ఒకటిన్నర రోజులకు కుదించేస్తున్నారు. అందులోనూ.. ఎక్కువ సంఖ్యలో ప్రజలను అనుమతించకూడదని నిర్ణయించారు. మండపాల్లో ఉన్నవారు.. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు.
భక్తుల కోసం సామాజిక మాధ్యమాల్లో దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫేస్బుక్, జూమ్, గూగుల్‌లో దర్శనాల కోసం లైవ్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు.
28ఏళ్ల చరిత్ర గల గురుగ్రామ్‌లోని సార్వజనిక్ గణేశ్ ఉత్సవ సమితి.. పూర్తిగా ఆన్‌లైన్‌కే పరిమితమవుతున్నట్టు ప్రకటించింది.
"ఈసారి భౌతిక దర్శనాలు ఉండవు. మొత్తం ఆన్లైన్ విధానమే. ఈ సారి వారం రోజుల పాటు గణేశుడిని మండపంలో ఉంచుతాం. కానీ మండపం ఎక్కడుంటుందన్నది మాత్రం ఎవరికి చెప్పం. ఈసారి నిధులను కూడా సేకరించడం లేదు. స్పాన్సర్లను కూడా పిలవడం లేదు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఆర్టిస్టులు లైవ్ చేయవచ్చు లేదా.. వారు ఉన్న చోటు నుంచి వీడియో రికార్డు చేసి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం."
--- జీవన్ తెలగోన్కర్, కమిటీ సభ్యుడు.
ఇలా దిల్లీలో మాత్రమే కాదు.. దాదాపు దేశమంతా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. గణేశ్ ఉత్సవాలు నిరాడంబరంగానే జరగనున్నాయి.
ఇదీ చూడండి:- లంబోదరుడు మెచ్చే చవితి స్పెషల్ రెసిపీస్