అయోధ్యలో చారిత్రక రామాలయ నిర్మాణం బుధవారం ప్రారంభం కానుంది. నిర్మాణంలో భాగంగా పునాది కోసం ఉదయం 8గంటలకు మొదటి ఇటుకలను వేయనున్నట్లు ఆలయ ట్రస్ట్ అధిపతి ప్రతినిధి తెలిపారు. నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... ఆలయానికి కేటాయించిన రామ జన్మభూమి ప్రాంతంలోని కుబేర్ తిలా మందిరంలో శివుడికి ప్రత్యేక ప్రార్థనలతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. లంకపై దాడికి ముందు రాముడు.. శివుడిని ప్రార్థించిన సంప్రదాయాన్నే రుద్రాభిషేక్ కర్మ అనుసరిస్తుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆలయానికి పునాది వేస్తారు.
మహంత్ నృత్య గోపాల్ దాస్ తరఫున ఇటీవలే స్థలాన్ని సందర్శించిన కమల్ నయన్ దాస్, ఇతర పూజారులు.. ప్రార్థనల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రెండు గంటలపాటు సాగే పునాది కార్యక్రమంతో మందిరం నిర్మాణం ప్రారంభమవుతుందని వివరించారు.
అయితే బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ లఖ్నవూ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత హాజరుకు సిద్ధంగా ఉండాలని లఖ్నవూ కోర్టు సోమవారం సూచించింది.
ఇదీ చూడండి: సుస్థిరమైన మహా సముద్రాల కోసం అన్వేషణ చేద్దాం!