సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ రెండో రోజున పిటిషన్‌దారు రామ్‌లల్లా విరాజ్మాన్ వాదనలు వినిపించింది. అయోధ్య రాముడి జన్మస్థలమేనని రామ్‌లల్లా తరఫు న్యాయవాది కె.ప్రశాసన్ స్పష్టం చేశారు.
"అయోధ్య కచ్చితంగా రాముడి జన్మస్థలమే. ఇదే విషయాన్ని వాల్మీకి రామాయణంలో మూడు సార్లు పేర్కొన్నారు. అయితే కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన విషయానికి ఆధారాలు అంటూ ఏమీ ఉండవు."
-కె.ప్రశాసన్, రామ్‌లల్లా తరఫు న్యాయవాది
రామ్‌లల్లా వాదనలపై సుప్రీం ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఏదైనా కోర్టులో దైవం పుట్టుకకు సంబంధించి విచారణ జరిగిందా? ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా యేసు క్రీస్తు విషయంలో ప్రశ్నించారా? అని అడిగింది.
ఈ విషయాల గురించి సరైన అవగాహన లేదని తెలిపిన ప్రశాసన్.. తెలుసుకుని సమాధానమిస్తామని కోర్టుకు నివేదించారు.
అఖాడాపై ధర్మాసనం అసంతృప్తి
మంగళవారం జరిగిన వాదనల్లో అయోధ్య వివాదాస్పద భూమి తమకే చెందుతుందని నిర్మోహి అఖాడా స్పష్టం చేసింది. అయితే భూమి తమదే అని నిరూపించేందుకు ఆధారాలను సమర్పించాలని నిర్మోహి అఖాడాను ధర్మాసనం కోరింది. సాక్షులు, ధ్రువపత్రాలు, రెవెన్యూ రికార్డులు ఉంటే ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
1982లో జరిగిన దోపిడిలో రికార్డులను కోల్పోయామని కోర్టుకు నివేదించింది అఖాడా. వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. రామ్‌లల్లాను వాదనలు ప్రారంభించాలని సూచించింది.
అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం విఫలమయిందని ప్రకటించిన సుప్రీంకోర్టు... ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ మొదలుపెట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేసును విచారిస్తోంది.
ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి మౌనం