ETV Bharat / bharat

ప్రాణాలు కాపాడే వైద్యులపైనే దాడులా?

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇటీవల మర్కజ్‌కు వెళ్ళివచ్చిన వేలాది మందికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 22వేలమందిని క్వారంటైన్​ కేంద్రాల్లో ఉంచారు. ఈ క్రమంలోనే అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందు వెళ్తున్న వారిపై దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు వైరస్​ ముప్పుతిప్పలు పెడుతుంటే.. వైద్యులకు సహకరించకుండా కొంతమంది తలనొప్పిగా మారుతున్నారు.

Attacks on doctors going to perform coronary exams on suspects
పరీక్షించేందుకు వెళ్లే వైద్యులపై దాడులు
author img

By

Published : Apr 5, 2020, 7:06 AM IST

యుద్ధ క్షేత్రంలో సైనికుల నిబద్ధత, సంకల్ప దీక్షలు అసామాన్యం. ప్రాణాల్ని పణంపెట్టి దేశమాతను కాపాడుకోవడానికి వారు చేసే త్యాగాలు నిరుపమానం. తెల్లకోటు వేసుకొని శాంతి కపోతాల్ని తలపించే వైద్యులు సరిహద్దుల్లేని యుద్ధరంగంలో సైనికులై కదం తొక్కాల్సిన దుస్థితిని కరోనా వైరస్‌ కల్పించింది. యావత్‌ ప్రపంచ దేశాలపై మహమ్మారిలా విరుచుకుపడి వేలమంది అభాగ్యుల ప్రాణాల్ని అనునిత్యం కబళిస్తోంది. ఇదీ మరో ఫ్లూ లాంటిదేనంటూ మొదట్లో చప్పరించేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌- మందూమాకూ లేని కరోనా కరాళ నృత్యాన్ని గుడ్లప్పగించి చూడాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో వైద్యారోగ్య రంగాల్ని ఎంతో బలోపేతం చేసుకొన్న దేశాలూ కొవిడ్‌ విజృంభణకు తల వేలాడేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని విధాలుగా పరిమిత వనరులున్న ఇండియా చేయగలిగింది ఒక్కటే. అనుమానితుల్ని క్వారంటైన్‌ చేసి, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసి, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడాన్ని ప్రబోధించి- వైరస్‌ గొలుసును తెగతెంచడమే! సజావుగా సాగాల్సిన జనారోగ్య మహాయజ్ఞంలో వరసగా అపశ్రుతులు చోటుచేసుకొంటున్నాయి. అనుమానితుల ఆనవాళ్లు చిక్కకపోవడం, వైద్యులపైనా ఆరోగ్య సిబ్బందిపైనా దాడులు చెయ్యడం వంటివి కరోనా రక్కసికి కొత్త కోరలు మొలిపిస్తున్నాయి.

నిర్లక్ష్యానికి భారీ మూల్యం..

నరుడే వాహనంగా విరుచుకుపడే కరోనా భూతానికి, ఒక్కచోట చేరే సమూహం- అక్షరాలా విందు భోజనం. కరోనా ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేసిన ఇటలీ వంటి దేశాలు అందుకు చెల్లిస్తున్న మూల్యం- అపార ప్రాణనష్టం. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని దిల్లీలో తబ్లీగీ జమాత్‌ సమ్మేళనం జరిగింది. దేశ దేశాల నుంచి వందల సంఖ్యలో, దేశీయంగా అనేక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో నిజాముద్దీన్‌ మర్కజ్‌కు హాజరైనవారితోనే ఇప్పుడు పెద్ద ఆపద వచ్చిపడింది. గత రెండు రోజుల్లోనే 14 రాష్ట్రాలకు చెందిన దాదాపు 650మంది ఆ మర్కజ్‌కు వెళ్ళి వచ్చాక కరోనా పాజిటివ్‌గా తేలడం దిగ్భ్రాంతపరుస్తోంది. దాదాపు తొమ్మిది వేలమంది జమాత్‌ కార్యకర్తల్ని గుర్తించి వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించినట్లు కేంద్రం చెబుతోంది. జమాత్‌ సమ్మేళానికి హాజరై కనిపించకుండాపోయిన విదేశీయులు, మర్కజ్‌కు వెళ్ళి వచ్చినవారితో సన్నిహితంగా మసలిన వారివల్ల మరెంతమందికి మహమ్మారి సోకుతుందోనన్న భయాందోళనలు ముమ్మరిస్తున్నాయి. అనుమానితులందర్నీ గుర్తించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఆ విధుల్లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న దాడులు- తామెంత ప్రమాదంలో ఉన్నదీ గుర్తించలేని మూర్ఖుల పనిగా తేటపడుతూనే ఉంది!

పరీక్షించేందుకని వెళ్తే...

ఆదిలాబాద్‌ నుంచి మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి వివరాలు సేకరిస్తున్న ఆశా కార్యకర్తపై సంబంధిత కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారిలో పలువురు కరోనా బారిన పడుతున్నందున, వారి వివరాలు సేకరించి, పరీక్షించి, క్వారంటైన్‌ చెయ్యాలన్న ప్రభుత్వ ప్రయత్నం- ఆ కుటుంబానికి ఎనలేని మేలు చేస్తుంది. మర్కజ్‌నుంచి వచ్చిన వ్యక్తికి, అతడి నుంచి కుటుంబానికి కరోనా సోకితే- సహజీవనం కాదు, ‘సహగమనమే’ మిగులుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది మరీ దారుణం. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నవారిని గుర్తించి పరీక్షించడానికి వెళ్ళిన ఇద్దరు మహిళా వైద్యులపై దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని కొవిడ్‌ కేసుల్లో నాలుగింట మూడొంతులకు పైగా ఇండోర్‌లో నమోదైనవే. వ్యాధి ప్రజ్వలన కేంద్రంగా మారిన ప్రాంతాల్లో విస్తృత పరీక్షల ద్వారా స్థానికుల ప్రాణాల్ని కాపాడటానికి ప్రభుత్వమూ వైద్యులూ పాటుపడుతుంటే- అమానుష దాడికి తెగబడుతున్న అజ్ఞానం అక్కడి స్థానికులది. మత పెద్దలుగా చలామణీ అవుతున్నవాళ్ళు తమ వర్గాలకు నిజంగా మేలు చెయ్యాలనుకొంటే, కొవిడ్‌ పరీక్షలకు క్వారంటైన్‌కు అనుకూలంగా గొంతువిప్పాలి. తబ్లీగీ జమాత్‌ పెద్ద తాను కూడా క్వారంటైన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. తన లాగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సమగ్ర వివరాలు సమర్పించి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్‌ కేంద్రాలకు స్వచ్ఛందంగా వెళ్ళాలని పిలుపివ్వాలిప్పుడు! మర్కజ్‌కు హాజరైన విదేశీయులు ఏ కలుగుల్లో ఉన్నా బయటకొచ్చి కొవిడ్‌ పరీక్షకు సిద్ధపడితేనే ప్రాణాపాయం నుంచి వారు, వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన సన్నిహితులు తప్పించుకోగలుగుతారన్న వాస్తవాన్ని బోధించి దారిన పెట్టడానికి మతపెద్దలే ముందుకు రావాలి. హితం కోరని మతం, బుద్ధిమతి నేర్పని పెద్దరికం- అంతిమంగా ఏం ఉద్ధరిస్తాయి?

అక్కడా ఇదే పరిస్థితి...

మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి దిల్లీకి వెళ్ళివచ్చిన జమాత్‌ సభ్యుల ఆనుపానులను గ్రామాధికారులకు తెలియజేసిన వ్యక్తిపై దాడి జరిగింది. నమూనాలు సేకరించడానికి వెళ్ళిన ‘నేరాని’కి బిహార్‌లోని ముంగర్‌లో పోలీసులు, ఆరోగ్య సిబ్బందికీ అదే ‘మర్యాద’ అనుభవమైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగినది వాటికి భిన్నమైనది, మరింత హేయమైనది! జమాత్‌కు వెళ్ళివచ్చిన 156మందిని ఘజియాబాద్‌ అధికారులు స్థానికంగా పలు ఆస్పత్రుల్లో క్వారంటైన్‌ చేస్తున్నారు. ఎమ్‌ఎమ్‌జీ ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు- అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నర్సుల పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించిన వైనం జుగుప్సాకరమైనది. వివరం బయటపడగానే నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టిన ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం- సరైన పనే చేసింది. యావద్దేశం ఒక భయానక వైరస్‌పై పోరాటంలో మునిగితేలుతున్నప్పుడు- ముందువరస సైనికులుగా తమ ప్రాణాలకు తెగించి ప్రజారోగ్య పరిరక్షణలో అహరహం పాటుపడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది నైతిక ధృతి ఏ మాత్రం చెదరకుండా కాచుకోవడం మనందరి విధి!

కొవిడ్‌ సోకిన ఒక రోగి ఇటీవల హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మృత్యువాత పడినప్పుడు వైద్యులపై దాడి జరిగింది. కొరతల కోమాలో ఉన్న ప్రజారోగ్య రంగం వైద్యుల విధ్యుక్త ధర్మ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించలేకపోతున్నా- అంకిత భావంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్లపై అమానుష దాడులు ఏ మాత్రం సహించరానివి. వైద్యుల భద్రతకు ఉద్దేశించిన చట్టాలు 19 రాష్ట్రాల్లో అమలులో ఉన్నాయి. వాటిలో ఒకటైన పశ్చిమ్‌ బంగలో నిరుడు వైద్యులపై జరిగిన దాడి దేశవ్యాప్త ఆందోళనకు ప్రేరకమైంది. సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యమూ దాఖలైంది. అసోమ్‌లో ఓ వైద్యుడి దారుణహత్య దరిమిలా కేంద్రం- వైద్యులు, ఆరోగ్యసిబ్బంది భద్రత కోసం ముసాయిదా బిల్లు రూపొందించింది. అది ఎప్పటికి చట్టరూపం దాలుస్తుందోగాని- కరోనాపై యుద్ధసమయంలో వైద్యనారాయణుల కృషికి కైమోడ్పులు అర్పిద్దాం. వారి గెలుపే జాతి విజయమని గుర్తించి పూర్తిగా సహకరిద్దాం!

-పర్వతం మూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.