ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్ నమూనాను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించబోతున్నారు. 2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే పరేడ్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శకటంలో అటల్ సొరంగమార్గంతో పాటు త్రిలోక్‌నాథ్ దేవాలయం, లాహౌస్, స్పిటి సంస్కృతిని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు శకటాల నమూనాలను రక్షణ శాఖ సూచన మేరకు రాష్ట్ర భాష, కళ, సాంస్కృతిక శాఖ సిద్దం చేసింది.
అటల్ సొరంగంతో పాటు రాష్ట్ర సంస్కృతిని గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించడం గర్వకారణమని లాహౌస్, స్పిటి ప్రాంత భాజపా ఎమ్మెల్యే రామ్‌లాల్ మర్కండ అన్నారు. దీని వల్ల ఎక్కువ మంది పర్యటకులు రాష్ట్రాన్ని సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తారని, తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.