ప్లాస్టిక్.. మనకు తెలియకుండానే మనిషి జీవితంలో భాగమైన వస్తువు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు భవిష్యత్ తరాలకు హాని ఉందని తెలిసినప్పటికీ దీనిని పూర్తిగా త్యజించలేకపోతున్నాం. అయితే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు ప్రజలకు వివరిస్తూ.. వారిలో అవగాహన కల్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు. తాజాగా బిహార్ నలంద జిల్లా హిస్లాకు చెందిన సామాజిక కార్యకర్త అశుతోష్ కుమార్ మానవ్... ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు.
గ్రామగ్రామానికీ వెళ్తూ ప్లాస్టిక్ వాడితే జరగబోయే భవిష్యత్ పరిణామాలేంటో.. అందరికీ వివరిస్తున్నారు. పాఠశాలలకు వెళ్తూ.. అక్కడి విద్యార్థులతో ప్లాస్టిక్ భూతాన్ని వాడకుండా ప్రమాణం చేయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సమాజసేవ చేయాలని నిర్ణయించుకున్న ఆయన.. 1991లోనే ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేపట్టినట్లు తెలిపారు. తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసేందుకే వివాహం కూడా చేసుకోలేదు. రాజకీయాల్లో చేరే ఉద్దేశమూ లేదన్నారు మానవ్.
"చిన్నప్పటి నుంచే సామాజికసేవ చేయడానికి నేనెప్పుడూ ఆసక్తిగా ఉండేవాడిని. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి సమాజసేవ ప్రారంభించాను. అప్పట్లో ప్రతి ఆదివారం నేను, నా మిత్రులు మురికి కాలువలను శుభ్రం చేసేవాళ్లం. కాలువల్లో మురుగునీటి పారుదలకు ప్లాస్టిక్ అడ్డంకిగా మారిందని అప్పుడే అర్థమైంది. అందుకే ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా."
- అశుతోష్ కుమార్ మానవ్, సామాజిక కార్యకర్త
సానుకూల స్పందన
ప్లాస్టిక్ నిషేధంపై కుమార్ చెబుతున్న మాటలు చిన్న పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఆయన మాటలను చుట్టుపక్కల వారికి చెబుతూ.. ప్లాస్టిక్‌ను వాడొద్దంటూ ప్రచారం చేస్తున్నారు విద్యార్థులు.
గతంలో 'క్విట్ గుట్కా' ఉద్యమంపై రాష్ట్రమంతా ప్రచారం చేశారు మానవ్. ప్రస్తుతం 'స్వచ్ఛభారత్'తో పాటు జల్ జీవన్ హరియాలి అభియాన్పైనా ప్రసంగాలు చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.