చైనాలో నివాసముంటున్న భారతీయులెవరూ అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ బారిన పడలేదని స్పష్టం చేసింది భారత విదేశాంగశాఖ. కరోనాపై డ్రాగన్ విశ్వవిద్యాలయాల్లోని భారతీయ విద్యార్థులను కూడా అప్రమత్తం చేసినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
"భారత్ కూడా చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతానికి భారతీయులెవరూ కరోనా వైరస్కు గురికాలేదు. వారందిరికీ ఆహారం, నీటి సౌకర్యం అందుబాటులో ఉన్నాయని అర్థమైంది."
-రవీశ్ కుమార్, విదేశాంగ ప్రతినిధి
చైనాలోని భారతీయుల సమస్యలకు స్పందించేందుకు అందుబాటులో మూడు హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ధాటికి ఇప్పటివరకు మృతుల సంఖ్య 80కి చేరింది. విదేశాల్లో 23 మందితో సహా సహా మొత్తం 2వేలకు పైగా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. గతేడాది డిసెంబరులో హుబీ రాష్ట్రంలోని వుహాన్ నగరంలో ఈ వైరస్‌ను కనుగొన్నారు అధికారులు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలోని 12 నగరాలను మూసేశారు. పరిస్థితిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు విదేశాగ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: 71వ గణతంత్ర భారతావని... ఎంపికైన పద్మ గ్రహీతలు వీరే