దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం సమావేశమైంది. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ జరిగింది. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ మొదలుకానున్న నేపథ్యంలో దీనికి అత్యంత కీలకమైన కొ-విన్ యాప్ నిర్వహణపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు ఇచ్చింది.
కరోనా టీకాను ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు ఇచ్చారు? ఏ టీకా? అనే విషయాలు అత్యంత ముఖ్యమని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ వివరాలను డిజిటల్ రికార్డు రూపంలో తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపింది. వ్యాక్సిన్ ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయలని పేర్కొంది. ఆధార్‌కు అనుసంధాంచిన మొబైల్ నంబర్‌నే రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించేలా లబ్ధిదారులకు సూచించాలని కేంద్రం చెప్పింది.
ఈ సమావేశానికి కరోనా వ్యాక్సిన్ నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ సభ్యుడు రామ్ సేవక్ శర్మ అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా జరిగిన డ్రైరన్ ప్రక్రియలో కొ-విన్ సాప్ట్‌వేర్‌పై అధికారుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎదురైన సవాళ్లను చర్చించారు. కొ-విన్ డిజిటల్ ప్లాట్‌ఫాం నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడలేదని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియలో వేగం, ప్రామాణికతను దృష్టిలో ఉంచుకుని కొవిన్‌ను రూపొందించినట్లు పునరుద్ఘాటించారు.
రాష్ట్రాల్లో ఏర్పాట్లు..
- దిల్లీలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాలను గుర్తించినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది. మొత్తం 89 చోట్ల టీకా పంపిణీకి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో మూడు ప్రభుత్వ, 53 ప్రైవేటు కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలకే టీకా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
- టీకా పంపిణీకి తాము సిద్దమని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలోని టీకా నిల్వల కేంద్రాలను ఆయన పరిశీలించారు. కర్ణాటకలో ఐదు పెద్ద టీకా నిల్వ కేంద్రాలున్నాయని, ప్రతి జిల్లాకు ఒక్కో స్టోరేజీ సౌకర్యం ఉందన్నారు. 45 లక్షల వ్యాక్సిన్లను తాము నిల్వ చేయగలమని, మొదటి విడతలో 13.9 లక్షల టీకాలు అందుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. టీకా సరఫరా కోసం 900 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికి టీకా అందించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఫరుఖాబాద్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి ఆరోగ్య మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో వివక్షకు తావు లేదని, 24 కోట్లమందిని కుటుంబంగా భావిస్తున్నామన్నారు.
టీకా ఫ్రీ..
కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే అందిస్తామని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారని తెలిపారు. మరో మూడు నెలల్లో బంగాల్‌లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో మమతా బెనర్జీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటన చేశారు.