ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పశుదాణా కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు చేయాలన్న లాలూ అభ్యర్థనను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో 14ఏళ్ల జైలుశిక్షకు గాను రెండేళ్ల కారాగారం పూర్తి చేసినందుకు బెయిల్ ఇవ్వాలన్న లాలూ వాదనలను తోసిపుచ్చింది సుప్రీం. 14 ఏళ్ల శిక్షకు రెండేళ్లు ఏమాత్రం సరితూగదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
లాలూ గత 8 నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకే చికిత్స పొందుతున్న లాలూ.. పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు చెబుతున్నారని సీబీఐ వాదించింది. ఆసుపత్రిలో లాలూను కొన్ని పార్టీల ముఖ్య నేతలు కలిసినట్లు కోర్టుకు తెలిపింది.
పశుదాణా కుంభకోణం ద్వారా రూ.75కోట్ల అవినీతికి పాల్పడినట్లు లాలూపై నాలుగు కేసులు నమోదయ్యాయి. రెండింటిపై విచారణ జరుగుతోంది. బెయిల్ మంజూరు చేస్తే ఈ కేసుల దర్యాప్తును లాలూ ప్రభావితం చేస్తారని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది.
1990లో బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లాలూ పశుదాణా కుంభకోణం ద్వారా రూ.900కోట్ల మేర అవినీతికి పాల్పడినట్టు అభియోగాలున్నాయి.
ఇదీ చూడండి: సోషల్ మీడియాలో సగం వార్తలు నకిలీవే!