ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో ఎంపీ స్మృతి ఇరానీ మద్దతుదారుడు, భాజపా నాయకుడైన సురేంద్ర సింగ్‌ను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన అమేఠీ జిల్లాలోని బరౌలియ గ్రామంలో జరిగింది. శనివారం అర్ధరాత్రి హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానికులు గాయాలపాలైన సురేంద్ర సింగ్‌ను గుర్తించి లఖ్‌నవూ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేంద్ర మృతిచెందారు.
సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి స్మృతి ఇరానీ చరిత్రాత్మక విజయం అందుకున్న కొన్ని రోజులకే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు అధికారులు.
పోలీసుల అదుపులో ఇద్దరు
ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సురేంద్ర సింగ్ హత్యపై ఆయన కుమారుడు స్పందించాడు. కాంగ్రెస్ మద్దతుదారులపై అనుమానాలు ఉన్నట్టు తెలిపాడు.
"ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. స్మృతి ఇరానీకి మా నాన్న మద్దతుదారుడు. ఎన్నికల సమయంలో ఆయన తినడానికి మాత్రమే ఇంటికి వచ్చేవారు. మిగతా సమయం ప్రచారాల్లో పాల్గొనేవారు. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలవడం వల్ల ప్రాంతం అంతటా సంబరాలు జరిగాయి. మా గ్రామంలో విజయ యాత్ర నిర్వహించారు. ఈ విషయం కొంత మంది కాంగ్రెస్ మద్దతుదారులకు నచ్చలేదని మేం అనుకుంటున్నాం. వారిలో ఈర్ష్య పెరిగింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. కొందరిపై అనుమానాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో నిజాలు తెలియాలి."
--- సురేంద్ర సింగ్ కుమారుడు
సురేంద్ర హత్యపై ఎస్పీ స్పందించారు. అన్ని కోణాల్లోనూ... ముఖ్యంగా రాజకీయ హత్య కోణంలో విచారణ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు అమేఠీ లోక్‌సభ భాజపా కన్వీనర్ రాజేశ్ అగ్రహారి. హస్తం పార్టీ ఘోర వైఫల్యం చవిచూసిన తరుణంలో స్మృతి ఇరానీ మద్దతుదారుడి హత్య జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి- సినీడైరీ: ఈ కుక్కలా ఒక్కరోజు బతికినా చాలు!